అహ్మదాబాద్: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతీ ఆశ్రమంలో సతీమణి మెలానియా ట్రంప్ కలియ తిరిగారు. వారికి సబర్మతీ ఆశ్రమం విశేషాలను ఒక్కటొక్కటే వివరిస్తూ గాంధీ జీవన విధానాన్ని తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వారి వెంట ఉన్నారు. 

మూడు కోతుల విగ్రహాలను చూపించి, వాటి ప్రత్యేకతను ట్రంప్ దంపతులకు మోడీ వివరించారు. గాంధీ రాట్నాన్ని ట్రంప్ తిప్పారు. ఆశ్రమం లోనికి ప్రవేశించే సమయంలో ట్రంప్ దంపతులు తమ పాదరక్షలను బయటే విప్పేశారు. సబర్మతి ఆశ్రమంలో వారు వరండాలో కూర్చున్నారు.

విజిటర్స్ బుక్ లో డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. "నా గ్రేట్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ... థ్యాంక్యూ ఫర్ దిస్ వండర్ ఫుల్ విజిట్" అని ట్రంప్ విజిటర్స్ బుక్ లో రాసి కింద సంతకం చేశారు. విజిటర్స్ బుక్ లో ట్రంప్ మహాత్మా గాంధీని ప్రస్తావించలేదు. ఆశ్రమం వద్ద ట్రంప్ దంపతులకు మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్వాగతం పలికారు. 

ఆ తర్వాత డోనాల్డ్ ట్రంప్ దంపతులు మొతేరా స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని ప్రసంగిస్తారు.