26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి తహవ్వూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత్ కోరిక మేరకు 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు ఈ భేటీలో ట్రంప్ అంగీకరించారు. పాకిస్తాన్ మూలాలున్న కెనడా పౌరుడైన రాణాపై 2008 ముంబై దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్ చాలా కాలంగా రాణాను అప్పగించాలని కోరుతోంది. ప్రస్తుతం రాణా అమెరికాలోని హై సెక్యూరిటీ జైలులో ఉన్నాడు.
మోదీతో భేటీ తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు
ప్రధాని మోదీతో భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ, “మేము చాలా ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నాం. ఈ వ్యక్తిపై ముంబై ఉగ్రదాడుల ఆరోపణలు ఉన్నాయి” అని అన్నారు. 2008 నవంబర్‌లో ముంబైపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 166 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. పాకిస్తాన్ మూలాలున్న కెనడా పౌరుడైన రాణా, 2008 ముంబై దాడులకు కుట్ర పన్ని, సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాణాను భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమం
అమెరికా కోర్టు రాణాను భారత్‌కు అప్పగించేందుకు అనుమతి ఇవ్వడంతో అతన్ని ఇండియాకు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. ఈ చర్య భారత్-అమెరికా మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. రాణా అప్పగింత ప్రక్రియ ఇరు దేశాల మధ్య చట్టపరమైన విధానాల ప్రకారం పూర్తవుతుంది. దీంతో 26/11 దాడుల నిందితులకు శిక్ష పడటానికి, దాడులకు సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి రావడానికి సహాయపడుతుంది.
ప్రధాని మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలు, ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లిన రెండవ నాయకుడు మోదీ.
