Asianet News TeluguAsianet News Telugu

అసలేంటీ ‘‘ హిట్ అండ్ రన్ ’’ నిబంధన .. ట్రక్కు డ్రైవర్లు అంతగా ఎందుకు భయపడుతున్నారు..?

కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం .. హిట్ అండ్ రన్ , ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. ఇందులోని సెక్షన్ 104లో రెండు నిబంధనలు వున్నాయి. దీని ప్రకారం నిర్లక్ష్యంగా వాహనం నడిపి, వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశం వుంది.

truck drivers strike : Truckers protest over new hit-and-run law What does it say ksp
Author
First Published Jan 2, 2024, 5:55 PM IST

ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో దేశం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. న్యాయశాఖ శిక్షాస్మృతుల్లో మార్పులను వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘‘హిట్ అండ్ రన్ ’’ కేసుకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనను వారు వ్యతిరేకిస్తున్నారు. త్వరలోనే అమల్లోకి రానున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు.

ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా దేశంలోని అనేక నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు అవుతూ వుండగా.. పెట్రోల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ సరఫరా చేసే ట్యాంకులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈ పరిస్ధితి తలెత్తింది. అంతేకారు వీరి సమ్మె కారణంగా రోజువారీ ప్రయాణాలు, నిత్యావసర సరుకుల రవాణా, పాఠశాలలపైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం, అధికారులు స్పందించడంతో కొన్ని చోట్ల ట్రక్కు డ్రైవర్లు ఆందోళన విరమిస్తున్నారు. 

అసలు ఇంతకీ హింట్ రన్ నిబంధన ఏంటీ..?

కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం .. హిట్ అండ్ రన్ , ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. ఇందులోని సెక్షన్ 104లో రెండు నిబంధనలు వున్నాయి. దీని ప్రకారం నిర్లక్ష్యంగా వాహనం నడిపి, వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశం వుంది. ఇది మొదటి నిబంధన కాగా.. రెండో దాని ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు యాక్సిడెంట్ గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. దీనిని ఉల్లంఘించి అక్కడి నుంచి పారిపోతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం వుంది. ఈ నిబంధనలను భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304ఏ కిందకు తీసుకొచ్చారు. 

ఈ నిబంధనలనే ట్రక్కు డ్రైవర్లు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో పదేళ్ల పాటు కుటుంబాలకు దూరంగా వస్తుందని, అదే జరిగితే తమ ఫ్యామిలీలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు..రూ.7 లక్షల జరిమానా చెల్లించడం కూడా తమ వల్ల కాదని డ్రైవర్లు చెబుతున్నారు. ఈ నిబంధనల వల్ల కొత్తగా డ్రైవర్ వృత్తిని చేపట్టేవారు వుండరని, ఇది పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులను తెస్తుందని హెచ్చరిస్తున్నారు. వీటిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష, జరిమానా తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios