కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం వాహనదారులను బేంబేలిత్తిస్తోంది. ఇప్పటికే నిబంధనలను అతిక్రమించిన వారికి వేలకు వేలు ఫైన్లు పడుతున్నాయి. తాజాగా ఒడిషాలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు రూ.86,500 జరిమానా విధించడం సంచలనం సృష్టించింది.

సెప్టెంబర్ 3న నాగాలాండ్‌ రాష్ట్రంలోని బీఎల్ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి చెందిన జేసీబీని ఛత్తీస్‌గఢ్‌కు తరలింస్తుండగా.. ఒడిశాలోని సంబాల్‌పూర్ జిల్లాలో నిర్వహిస్తున్న పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. దీంతో అధికారులు ట్రక్కు డ్రైవర్ అశోక్ జాదవ్‌కు జరిమానా విధించారు.

అనధికారిక వ్యక్తికి డ్రైవింగ్ బాధ్యతను అప్పగించినందుకు రూ.5 వేలు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు రూ.5 వేలు, అదనంగా 18 టన్నుల బరువును రవాణా చేస్తున్నందుకు రూ.56 వేలు, పరిమితికి మించిన లోడుతో వెళ్తున్నందుకు రూ. 20 వేలు, సాధారణ తప్పిదాలకు మరో రూ.500 కలిపి మొత్తంగా రూ. 86,500 జరిమానా విధించారు.

ట్రక్కు డ్రైవర్ పోలీసులను ప్రాధేయపడటంతో చివరికి జరిమానాను రూ.70 వేలకు తగ్గించారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇంతటి భారీ మొత్తం జరిమానా విధించడం ఇదే తొలిసారి.

కాగా.. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని, ఒడిషా ప్రభుత్వం అదే రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. తొలి నాలుగు రోజుల్లోనే సుమారు రూ.88 లక్షలు జరిమానా కింద వసూలు చేసింది. తద్వారా ఈ చట్టం కింద అత్యధిక మొత్తం జరిమానా విధించిన రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.