Agartala: త్రిపుర మ‌హిళా క‌మిష‌న్ చీఫ్ పై బీజేపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశాడు. స్వయంగా బీజేపీ సీనియర్ నేత అయిన గోస్వామి తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహాకు కూడా సమాచారం అందించారు. 

Tripura Women's Commission Chief Barnali Goswami: త్రిపుర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ బర్నాలి గోస్వామిపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాడి చేసిన వారిలో ఎన్నికైన బీజేపీ కౌన్సిలర్లు కూడా ఉన్నట్లు స‌మాచారం. స్వయంగా బీజేపీ సీనియర్ నేత అయిన గోస్వామి తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహాకు కూడా సమాచారం అందించారు.

వివ‌రాల్లోకెళ్తే.. త్రిపుర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ బర్నాలి గోస్వామిపై ఉత్తర త్రిపురలోని ధర్మానగర్ లో కొందరు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఆమెపై దాడి చేసిన‌వారిలో ఎన్నికైన‌ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. స్వయంగా బీజేపీ సీనియర్ నేత అయిన గోస్వామి తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, రాష్ట్ర ముఖ్య‌మంత్రి ముఖ్యమంత్రి మాణిక్ సాహాకు, ధర్మనగర్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి కూడా సమాచారం అందించారు. 

తన ఇంటి పక్కనే ఉన్న పక్కింటి వారిని కలిసేందుకు వెళ్లిన తనపై సుమారు 200 మంది మహిళలు, కొందరు పురుషులు దాడి చేశారని త్రిపుర మ‌హిళా క‌మిష‌న్ చీఫ్ బ‌ర్నాలి గోస్వామి వెల్ల‌డించారు. ధర్మానగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న త్రిపుర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ బిశ్వ బంధు సేన్ తనపై దాడి చేయడానికి దాడి చేసిన వారికి మద్దతు ఇచ్చారని గోస్వామి పేర్కొన్నారు. "ఈ దాడిలో నేను గాయపడ్డాను. దుండగులు నా చీర, ఇతర దుస్తులను చింపేశారు. పోలీస్ స్టేషన్ కు పలుమార్లు ఫోన్ చేసినా పోలీసులు సాయం చేయలేదు" అని ఆమె మీడియాకు తెలిపారు.

ఈ దాడిలో త‌న సహచరులు, బాడీ గార్డు కూడా గాయపడినట్లు బ‌ర్నాలి గోస్వామి తెలిపారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి బిశ్వ బంధు సేన్ నిరాకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గోస్వామికి బీజేపీ టికెట్ నిరాకరించిన తరువాత, ఆమె సేన్ కు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారని ఆయ‌న మద్దతుదారులు ఆరోపించారు. ఈ ఆరోపణలను బ‌ర్నాలి గోస్వామి తోసిపుచ్చారు. తాను ఎప్పుడూ పార్టీకి, ఏ నాయకుడికి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ప్రతిపక్ష సీపీఎం, కాంగ్రెస్ ఈ ఘటనను ఖండిస్తూ దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి.

కాగా, 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేయగా, దాని మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది.