తోటి మహిళా మంత్రిపై మరో మంత్రి అసభ్యంగా ప్రవర్తించాడు అది కూడా ఏకంగా ప్రధాని సమక్షంలోనే. వివరాల్లోకి వెళితే.. త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రధాని శిలాఫలకం ఆవిష్కరిస్తుండగా మంత్రులంతా ఇరు పక్కలా నిల్చొన్నారు.

ఈ క్రమంలో మంత్రి కాంతిదేవ్, తోటి మహిళా మంత్రి సంతన చక్మా నడుము భాగాన్ని తాకేలా నిలబడ్డారు. ఆమె వెంటనే కాంతిదేవ్ చేతిని తీసివేశారు. అయితే ఈ దృశ్యం మీడియాలో పదే పదే ప్రచారం కావడంతో మహిళా సంఘాలు భగ్గుమన్నాయి.  

తాను బాధ్యతగల హోదాలో ఉన్నానన్న సంగతి మరిచిపోయి తోటి మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించిన కాంతిదేవ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగర్తలాలో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి..మంత్రిని అరెస్ట్ చేయించి వెంటనే చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.