కస్టడీలో ఉన్న ఖైదీల పట్ల పోలీసులు అత్యంత అనాగరికంగా ప్రవర్తించారు. మంచినీరు అడిగిన పాపానికి వారి చేత మూత్రం తాగించారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్రం అలీరాజ్‌పూర్ జిల్లాలోని నన్‌పూర్‌కు చెందిన ఐదుగురు గిరిజన యువకులను ఓ నేరం కింద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

విచారణ పేరిట ఖాకీలు లాఠీ ఝుళిపించి.. చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకులు తాగడానికి మంచి నీళ్లు ఇవ్వాలని పోలీస్ సిబ్బందిని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ కనినకరించని ఖాకీలు వారి చేత మూత్రం తాగించి అనాగరికంగా ప్రవర్తించారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం... ఇది ఆ నోటా ఈ నోటా జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన ఆయన, ఘటనకు బాధ్యులైన నలుగురు స్టేషన్ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు.