Asianet News TeluguAsianet News Telugu

సొంతూరికి స్వయంగా రోడ్డేస్తున్న గిరిజనుడు ధనేశ్వర్ ప్రధాన్.. ‘మాంఝీ’ని తలపిస్తున్న కృషి

ఒడిశాలో గాంజా జిల్లా సరిహద్దులోని ఓ కుగ్రామానికి సమీప పట్టణాలకు మధ్య సరైన దారి లేదు. ఎగుడుదిగుళ్లతో కొండలు ఎక్కిదిగాల్సిన పరిస్థితి. వైద్యం సహా ఇతర అత్యవసర పరిస్థితులకు వాహనాలపై ఆ ఊరి నుంచి బయటికి వెళ్లే అవకాశమే లేదు. దీనిపై అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం రాలేదు. దీంతో ఆ ఊరికి చెందిన గిరిజనుడు ధనేశ్వర్ ప్రధాన్ స్వయంగా రోడ్డు నిర్మించడానికి పూనుకున్నాడు.

tribal man constructing road himself in odisha recalling manjhi
Author
Bhubaneswar, First Published Sep 11, 2021, 3:27 PM IST

భువనేశ్వర్: బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ గుర్తున్నారా? 22ఏళ్లు ఒక్కడే సుత్తెతో కొండను వొలిచి 55 కిలోమీటర్ల దూరాన్ని 15 కిలోమీటర్లకు కుదించి చరిత్రరాశారు. ఎగుడుదిగుడుగా ఉన్న కొండపై నుంచి పడి గాయాలతో మరణించిన తన భార్యను సులువుగా మరిచిపోలేకపోయాడు. వైద్యానికైనా, ఇతర అవసరాలకైనా అడ్డంగా కనిపిస్తున్న కొండను కరిగించడమే ధ్యేయంగా మొక్కవోని దీక్షతో 22ఏళ్లు ఒక్కడే ఆ పనిచేశాడు. గయా సమీపంలోని గెహలార్ గ్రామస్తుడు మాంఝీ ఆ తర్వాత ‘మౌంటెయిన్ మ్యాన్‌’గా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. తాజాగా, ఆయనను గుర్తు చేసేలా ఒడిశాలో ధనేశ్వర్ ప్రధాన్ తన స్వగ్రామానికి రోడ్డేసే పనిలో పడ్డాడు.

గాంజా జిల్లా సరిహద్దుల్లో కేరుబడి దగ్గరలోని బడాపెంగ గ్రామం ఉన్నది. చుట్టూ అడవులతో నిండి ఉన్న ఈ గ్రామంలో పది కోంద్ కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 56 మంది ఉన్నారు. ఇప్పటికీ ఆ ఊరిలో కరెంట్ లేదు. మంచి నీటి సదుపాయం లేదు. అత్యవసర అవసరాలకు, వైద్యానికి పట్టణాలకు వెళ్లడానికి సరైన దారీ లేదు. ఈ విషయాన్నే గ్రామపంచాయతీ మొదలు, జిల్లా స్థాయి అధికారుల దాకా ధనేశ్వర్ ప్రధాన్ తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి తిరిగాడు. కానీ, పనికాలేదు.

అంతటితో తన ప్రయత్నాన్ని విరమించుకోదలుచుకోలేదు. అత్యవసరాల కోసం పట్టణాలకు వాహనాలపై వెళ్లడానికి దారి ఉండాల్సిందేనని నిశ్చయించుకున్నాడు. ప్రభుత్వం అందుకు పూనుకోకుంటే స్వయంగా తానే ఆ పనిచేస్తానని స్పష్టం చేసుకున్నాడు. ఇదే విషయాన్ని సహ నివాసులకు చెప్పాడు. కానీ, వారు కూలి వదిలి స్వచ్ఛందంగా ఆ పనికి రావడానికి విముఖత చూపించారు. అయినప్పటికీ ధనేశ్వర్ ప్రధాన్ వెన్నుచూపలేదు. తన భార్య, నలుగురు సంతానంతో రోడ్డేసే పనికి ఉపక్రమించాడు.

ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఓ సర్వే కోసం సమాచార సేకరణకు వెళ్లకుంటే ఈ విషయం బయటికి తెలిసేదే కాదు. ఆ ఊరికి వెళ్తూ అడవిలో తప్పిపోయారు. ఎలాగోలా రోడ్డును నిర్మిస్తున్న ధనేశ్వర్ ప్రధాన్ కుటుంబాన్ని కనుగొన్నారు. వారి దగ్గరకు వెళ్లి ఆ ఊరికి దారిని ఆరా తీయగా ఈ విషయం తెలియవచ్చింది. ప్రభుత్వ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో స్వయంగా రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిసింది.

మా గ్రామానికి కేరుబడికి రోడ్డు వేయాలనుకుంటున్నామని ధనేశ్వర్ తెలిపారు. వీటి మధ్య దూరం ఆరు కిలోమీటర్లు అని, ఇప్పటికే నాలుగు కిలోమీటర్ల దారి పూర్తయిందని వివరించారు. త్వరలోనే మిగతా దారిని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రోడు వల్ల తమ గ్రామానికి చేరడానికి ఆ కొండలు గుట్టలు ఎక్కాల్సిన పని ఉండదని, వాహనాలపైనా మా ఊరికి రావచ్చని వివరించారు.

ఈ విషయాన్ని అధికారులతో ప్రస్తావించడంతో తాము వంద రోజుల పని కింద ఈ దారి నిర్మించడానికి ప్రణాళికలు వేస్తున్నామని, ధనేశ్వర్ కుటుంబీకులు సహా ఇతరులతో ఈ పథకం కింద రోడ్డు నిర్మిస్తామని దరింగ్‌బడి బీడీవో కాలకృష్ణ ప్రధాన్ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios