హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల భూమి కంపించింది. దాంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. 

తెలంగాణలోని ఖమ్మం జిల్ాల చింతకాని మండలంలో గల నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు గ్రామాల్లో భూమి కంపించింది. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజవర్గాల్లోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారు జామును 2.37 గంటల సమయంలో 3 నుంచి 6 కెసన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. 

ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. ఏడేళ్ల క్రితం జనవరి 26వ తేదీన ఖమ్మం జిల్లాలోని పాతర్లపాడు, నాగులవంచ తదితర గ్రామాల్లో ఇదే విధంగా భూమి కంపించినట్లు చెబుతున్నారు.