ట్రాన్స్‌జెండర్ల దరఖాస్తులను ప్రత్యేక కోటా కింద పరిగణించాలని, సైకియాట్రి నర్సింగ్ కోర్సుల్లో వీరిని థర్డ్ జెండర్ క్యాటగిరీ అభ్యర్థులుగా తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. మేల్, ఫీమేల్‌ కేటగిరీలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న మెరిట్ లిస్టును సవరించి అందులో థర్డ్ జెండర్ కేటగిరీని చేర్చాలని స్పష్టం చేసింది. 

చెన్నై: థర్డ్ కోటా కోసం సూచించిన ప్రత్యేక రిజర్వేషన్‌కు ట్రాన్స్‌జెండర్లు అర్హులు అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. సైకియాట్రీ నర్సింగ్ కోర్సుల్లో పోస్ట్ బేసిక్ డిప్లమా, పోస్ట్ బేసిక్ (నర్సింగ్) కోర్సుల అడ్మిషన్‌లో వెంటనే థర్డ్ జెండర్ కోటా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చెన్నై, సెలెక్షన్ కమిటీ సెక్రెటరీ‌లకు ఆదేశాలు జారీ చేసింది.

పోస్ట్ బేసిక్ (నర్సింగ్) కోర్సు, సైకియాట్రి నర్సింగ్ కోర్సులో పోస్ట్ బేసిక్ డిప్లమాలో ప్రవేశాలకు ఈ విద్యా సంవత్సరానికి రూపొందించిన ప్రాస్పెక్టస్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ట్రాన్స్‌జెండర్ తమిల్ సెల్వి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక కేటగిరీగా పేర్కొనలేదని, ఇది చట్ట విరుద్ధం అని పేర్కొన్నారు.

దీంతో ఆమెను ట్రాన్స్‌జెండర్ క్యాటగిరీ లేదా స్పెషల్ క్యాటగిరీలో పరిగణించాలని ఆదేశించింది. ప్రస్తుతం మేల్, ఫీమేల్ కేటగిరీలుగా మాత్రమే జారీ చేసిన మెరిట్ లిస్టులో థర్డ్ జెండర్‌ను చేర్చాలని ఆదేశించింది. తమిల్ సెల్వి మాత్రమే కాదు.. ఇతర ట్రాన్స్‌జెండర్లూ ఎవరైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకుని ఉంటే వారిని కూడా స్పెషల్ కోటాలో పరిగణించాలని స్పష్టం చేసింది.