హర్యానా, పంజాబ్ ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగడ్ ను కేవలం పంజాబ్ రాష్ట్రానికే రాజధానిగా ఉంచాలని సీఎం భగవంత్ మాన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అంశంపై తీర్మానం చేసేందుకే ప్రత్యేకంగా శుక్రవారం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. 

చండీగఢ్‌ను వెంటనే పంజాబ్‌కు మాత్ర‌మే రాజ‌ధానిగా మార్చాల‌ని ఆ రాష్ట్ర సీఎం భ‌గ‌వంత్ మాన్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు పంజాబ్ అసెంబ్లీలో ఆయ‌న శుక్ర‌వారం దీనికి సంబంధించిన తీర్మాణాన్ని ప్ర‌వేశపెట్టారు. చండీగ‌ఢ్ ను సెంట్రల్ సర్వీ స్ రూల్స్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం భ‌గ‌వంత్ మాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. గతంలో చండీగఢ్‌ను పంజాబ్‌కు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ అనేక తీర్మానాలు చేసిందని చెప్పారు. ‘‘ సామరస్యాన్ని కొనసాగించడం, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడం కోసం, చండీగఢ్‌ను వెంటనే 
పంజాబ్‌కు బదిలీ చేయాలి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ సభ మరోసారి తీసుకెళ్తోంది. ’’ అని తెలిపారు. 

కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చండీగఢ్ నగరం పంజాబ్, హర్యానాల రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉంది. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్ది రోజుల కిందట చంఢీగఢ్ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ విష‌యంలో మాట్లాడారు. చండీగఢ్ యూనియ‌న్ టెరిట‌రీ ఉద్యోగుల‌కు పంజాబ్ సర్వీస్ రూల్స్‌కు బదులుగా సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో పంజాబ్ అసెంబ్లీలో నేడు ఈ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. కాగా శుక్ర‌వారం ఈ స‌భ ప్రారంభమైన వెంట‌నే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాణా గుర్జీత్ సింగ్ కుమారుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన రాణా ఇందర్ ప్రతాప్ సింగ్ ప్రమాణం చేశారు.