శిక్షణ విమానం కూలి ఇద్దరు ట్రైనీ పైలట్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ  విషాద సంఘటన సోమవారం ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిరాసలా వైమానిక కేంద్రం నుంచి సోమవారం ఉదయం టేకాఫ్ అయిన సెస్నా ఎఫ్ఏ -152 వీటీ ఈఎన్ఎఫ్ శిక్షణ విమానం కుప్పకూలింది. బిరాసలా ప్రభుత్వ వైమానిక శిక్షణ సంస్థలో సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు టేకాప్ అయిన శిక్షణ విమానం కొద్దిసేపటికే కంకదహడ సమీపంలో కుప్పకూలిందని ధెంకనల్ జిల్లా ఎస్పీ అనుపమ జేమ్స్ చెప్పారు. 

ఈ విమాన ప్రమాదంలో పైలట్ల శిక్షకుడు సంజయ్ కుమార్, ట్రైనీ పైలట్ అనీస్ ఫాతిమాలు మరణించారు. శిక్షణ విమానం టేకాఫ్ అయిన తర్వాత తలెత్తిన లోపంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ చెప్పారు.మరణించిన సంజయ్ కుమార్ బీహార్ రాష్ట్ర వాసి. ట్రైనీ పైలట్ అనీస్ ఫాతిమా ఉత్తరభారతదేశానికి చెందినవారని ఎస్పీ  పేర్కొన్నారు. లాక్ డౌన్ అనంతరం జూన్ 1వతేదీన బిరాసలా వైమానిక శిక్షణ కేంద్రం పునర్ ప్రారంభించారు.