కొత్త సంవత్సరంలో రైల్వే శాఖ అధికారులు ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ఛార్జీలను పెంచింది. వివిధ ప్యాసింజర్ రైళ్లకు కిలోమీటరుకి కనీసం 40 పైసలు పెంచుకుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

ఈ పెరిగిన రైలు ఛార్జీలు జనవరి 1వ తేదీ నుంచే అమలుకానున్నాయి. సాధారణ నాన్‌ ఏసీ రైళ్లకు ఈ చార్జీలు కిలోమీటరకు ఒక పైసా పెరగనుండగా.. నాన్‌ ఏసీ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరుగుతాయి. ఇక అన్ని ఏసీ తరగతులకు కిలోమీటరుకు 4 పైసల చొప్పున పెరుగుతున్నట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి. 

సబర్బన్‌ రైళ్లు మినహా రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్‌, తేజస్‌, హమ్‌ సఫర్‌, మహామన, గతిమాన్‌, గరీబ్‌రథ్‌, అంత్యోదయ, జనశతాబ్ది తదితర రైళ్లన్నింటికీ ఈ చార్జీల పెంపు వర్తిస్తుందని వివరించాయి. అయితే జనవరి 1కి కన్నా ముందు బుక్‌ చేసుకున్న టికెట్లకు ఈ పెంపు వర్తించదని తెలిపాయి. 

దీంతోపాటు రిజర్వేషన్‌ ఫీజు, సూపర్‌ఫాస్ట్‌ చార్జీల్లో కూడా ఎటువంటి మార్పు ఉండబోదని పేర్కొన్నాయి. కాగా రైల్వే చార్జీలను 2014-15లో సవరించారని, అనంతరం నిర్వహణ ఖర్చులు పెరిగాయని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.