రైలులో సీటు కోసం జరిగిన గొడవ.. ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైంది. తన భార్యకు కూర్చోడానికి కొంచెం  సీటు ఇవ్వమని కోరిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి  చంపేశారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కళ్యాణ్ ప్రాంతానికి చెందిన సాగర్ మకరంద్(26) , అతనతి భార్య జ్యోతి, వారి రెండేళ్ల కుమార్తెతో కలిసి రైలు ఎక్కారు. బుధవారం రాత్రి సమయంలో వారు ముంబయి నుంచి లాటూర్ వెళ్లే బీదర్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. 

జనరల్ కంపార్ట్ మెంట్ మొత్తం జనాలతో నిండిపోయి ఉంది. కూర్చోడానికి ఎక్కడా సీటు కూడా దొరకలేదు. చిన్న పాపతో భార్య పడుతున్న అవస్థ చూడలేక ఎవరినైనా సీటు అడగాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ వద్దకు వెళ్లి.. కొంచెం సర్దుకుంటే తన భార్యకూడా కూర్చుంటుందని.. చేతిలో చిన్నపాప ఉందని వెళ్లి రిక్వెస్ట్ చేశాడు.

Also Read మెట్రోలో చేదు అనుభవం.. యువతికి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ...

అతని రిక్వెస్ట్ ని సదరు మహిళ పట్టించుకోకపోగా.. సీటు అడిగాడని సాగర్ మకరంద్ ని ఘోరంగా దూషించడం మొదలుపెట్టింది. దీంతో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే కొందరు అక్కడకు వచ్చి.. దాదాపు 12మంది సాగర్ పై దాడి చేశారు. వారిలో ఆరుగురు మహిళలుకూడా ఉండటం గమనార్హం.  వాళ్లందరూ ఒక్కసారిగా పిడిగుద్దుల వర్షం కురిపించడంతో.. సాగర్ తట్టుకోలేకపోయాడు.

తన భర్తను అంత దారుణంగా కొడుతుండటంతో.. వదిలిపెట్టమని జ్యోతి వాళ్లను వేడుకుంది. అయినా వాళ్లు వినకుండా దాదాపు గంటపాటు కొట్టారు. ఆ తర్వాత తీవ్రగాయాలపాలైన భర్త సాగర్ ని జ్యోతి పక్క స్టేషన్ లో రైల్వే పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందాడు.

కాగా.. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. నిందితుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారన్నారు.