ఒడిశాలో రైలు ప్రమాదం : రూ.2000 నోట్ల విషయంలో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరిగిందంటే ?
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పశ్చిమ బెంగాల్ లో నష్టపరిహారం అందించే విషయంలో టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బాధితులందరికీ నష్టపరిహారంగా రూ.2000 నోట్లు అందించడమే తాజా వాగ్వాదానికి కారణమైంది.
మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య తాజాగా రూ. 2000 నోట మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ గొడవ రూ.2000 నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల ఏర్పడింది కాదు.. 278 మంది ప్రాణాలు కోల్పోయిన ఒడిశా రైలు ప్రమాదంపై మొదలైంది. ఈ విషయంలో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
పెళ్లైన తెల్లారే అత్తగారింటినుంచి చెల్లెను కిడ్నాప్ చేసిన అన్న.. ఎందుకంటే..
అసలేం జరిగింది ?
ఒడిశా రైలు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన అనేక మందికి గాయాలు అయ్యాయి. వారంతా ఒడిశాలోని కటక్ లో చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స పొందుతున్న వారిని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం కటక్ వెళ్లి పరామర్శించారు. అయితే అదే సమయంలో ఆమె పార్టీకి చెందిన నేతలు పలువురు బాధితులకు పశ్చిమ బెంగాల్ లో నష్టపరిహారం అందించారు. దానిని నగదు రూపంలో ఇచ్చారు. అయితే దీనిపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ కటక్ లో ఉన్న సమయంలోనే బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ స్పందిస్తూ.. తృణమూల్ పార్టీ తరఫున రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి బాధిత కుటుంబాలకు రూ .2 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేస్తున్నారని, అయితే అందులో మొత్తం రూ.2 వేల నోట్లే ఉన్నాయని పేర్కొన్నారు.
‘‘మమతా బెనర్జీ ఆదేశాల మేరకు తృణమూల్ పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు రాష్ట్ర మంత్రి ఒకరు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. రూ.2000 నోట్ల కట్ట ఇవ్వడంలో అర్థం ఏమిటి ? ప్రస్తుతం మార్కెట్ లో రూ.2000 నోట్ల సరఫరా తక్కువగా ఉంది. వాటిని బ్యాంకుల ద్వారా మార్పిడి చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో రూ.2000 నోట్లు ఇవ్వడం ద్వారా పేద కుటుంబాల సమస్య పెరుగుతుంది. అయితే ఇది నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే చౌక విధానమా ?’’ అని ప్రశ్నించారు.
ఈ ఆరోపణలపై బీజేపీపై టీఎంసీ మండిపడింది. రూ.2,000 నోట్లు చట్టవిరుద్ధం కాదని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు. ‘‘సుకాంత మజుందార్ ట్వీట్ నిరాధారం. ఈ నోటు (రూ.2000) ఇంకా చట్టవిరుద్ధం కాలేదు. ఈ నోటును మోడీ ప్రభుత్వం మాత్రమే ప్రవేశపెట్టింది. మేము ఇచ్చిన రూ.2000 నోట్లు నల్లధనం కాదు. అది నిరాధారం. సుకాంత మజుందార్ నల్లధనంపై కోచింగ్ తీసుకోవాలనుకుంటే సువేందు అధికారితో మాట్లాడాలి. నల్లధనం ఏ డినామినేషన్ లోనైనా ఉండొచ్చు’’ అని అన్నారు.
అమానుషం.. పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కాడని.. దళిత వరుడిపై రాళ్లదాడి
ఇదిలా ఉండగా.. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు, మృతుల కుటుంబాలకు కేంద్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు వేర్వేరుగా పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, మానసిక, శారీరక ఒత్తిడికి గురైన వారికి రూ.10 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే.