చత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం... తొమ్మిదిమంది మృతి, శిథిలాల కింద మరింతమంది
చత్తీస్ ఘడ్ లో నిర్మాణంలో వున్న స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాలకింద చిక్కుకున్నారు.
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంగెేలి జిల్లాలోని నిర్మాణంలో వున్న ఓ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ చిమ్ని ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 25-30 మంది శిథిలాలకింద చిక్కుకున్నారు. వీరిలో తొమ్మిదిమంది ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన రంబోడ్ ప్రాంతంలోని సారగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన కుసుమ్ స్టీల్ ప్లాంట్ లో ఐరన్ పైపులు తయారు అవుతాయి. అయితే ఈ ప్లాంట్ లో కొద్దిరోజులుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం చాలామంది నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారు.
తాజాగా భారీ చిమ్ని వద్ద పనులు జరుగుతుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది. దీంతో అక్కడేవున్న 30 మందికిపైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్నారు.
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులకు కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. విపత్తు నిర్వహణ అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలికి దగ్గర్లోని బిలాస్పూర్, పెండ్రా, రాయిఘర్, జంజ్గిర్-చంపా జిల్లాల విపత్తు అధికారుల సహాయం కూడా కోరారు.
జిల్లాలోని అన్ని హాస్పిటల్స్ కు ఇప్పటికే సమాచారం అందించారు... క్షతగాత్రులను తరలించగానే వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ఇతర శాఖల అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.