Asianet News TeluguAsianet News Telugu

ట్రాక్టర్ విన్యాసాల పోటీల్లో విషాదం.. ఇంజిన్ కింద పడి స్టంట్ మ్యాన్ దుర్మరణం.. వీడియో వైరల్

పంజాబ్ లో విషాదం చోటు చేసుకుంది. గ్రామీణ స్పోర్ట్స్ ఫెయిర్ లో ట్రాక్టర్ తో విన్యాసాలు చేస్తున్న స్టంట్ మ్యాన్ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలై మరణించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ మారింది.

Tragedy in tractor acrobatics competitions.. Stunt man dies due to falling under the engine.. Video viral..ISR
Author
First Published Oct 30, 2023, 9:57 AM IST

ట్రాక్టర్ విన్యాసాల పోటీల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విన్యాసాలు జరుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఇంజిన్ కింద పడి స్టంట్ మ్యాన్ మరణించాడు. ఈ ఘటన పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాలు ఇలా ఉన్నాయి. టేట్ గ్రామానికి చెందిన 29 ఏళ్ల సుఖ్ మన్ దీప్ సింగ్ ట్రాక్టర్ తో విన్యాసాలు చేయడంలో నేర్పరి. ఆయన చేసిన విన్యాసాలు గతంలో పలు టీవీ చానెళ్లలో కూడా ప్రసారమయ్యాయి. సుఖ్ మన్ దీప్ భార్య పంజాబ్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నారు. 

కాగా.. గురుదాస్ పూర్ జిల్లా ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో గ్రామీణ స్పోర్ట్స్ ఫెయిర్ లో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు సుఖ్ మన్ దీప్ వెళ్లారు. పోటీల్లో భాగంగా తన ట్రాక్టర్ ముందు టైర్లను గాల్లోకి లేపాడు. అది వెనక రెండు టైర్లపై తిరుగుతున్న సమయంలోనే కిందికి దిగిపోయారు. ఆ వాహనం వెనక టైర్లతో, రౌండ్ గా తిరుగుతోంది. దీనిని అక్కడ ప్రేక్షకులు చూస్తూ చప్పట్లు కొడుతున్నారు. ఈ క్రమంలో సుఖ్ మన్ ఓ టైర్ పై కాలు పెట్టి, పైకి ఎక్కి, డ్రైవర్ సీటులో కూర్చునేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో ఆయన కంట్రోల్ కోల్పోయి వెనక టైర్ల కింద పడిపోయారు. కానీ ఇంజిన్ అలా రౌండ్ గా తిరుగుతూనే ఉంది. వెంటనే అక్కడున్న పలువురు అతడిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. కొంత సమయం తరువాత అతడు ఇంజిన్ కింది నుంచి బయటకు వచ్చారు. భారీగా బరువు ఉండే ఇంజిన్ అతడిపై నుంచి వెళ్లడంతో అప్పటికే తీవ్రగాయాలు అయ్యాయి. 

స్థానికులు వెంటనే సుఖ్ మన్ దీప్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో స్పోర్ట్స్ ఫెయిర్ రద్దు అయ్యింది. కాగా.. సుఖ్ మన్ దీప్ ట్రాక్టర్ తో విన్యాసాలు చేస్తుండటం, దాని కింద పడిపోవడం, గాయాపాలవడం అక్కడున్న పలువురు వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios