Srinagar: జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ లో బైసాఖీ వేడుకల నేపథ్యంలో ఫుట్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 80 మందికి గాయాలు అయ్యాయి. 20-25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదే తరహాలో పూంచ్ జిల్లా ఖనేతార్ గ్రామంలో చోటుచేసుకున్న మరో ఘటనలో 43 మంది గాయపడ్డారు.
Footbridge Collapses During Baisakhi Celebration: బైసాఖీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా బైన్ గ్రామంలోని బేనీ సంగం వద్ద శుక్రవారం బైసాఖీ వేడుకల సందర్భంగా ఫుట్ బ్రిడ్జి కూలిన ఘటనలో పలువురు చిన్నారులు సహా 80 మంది గాయపడ్డారు. పోలీసులు, ఇతర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని ఉధంపూర్ ఎస్ఎస్పీ డాక్టర్ వినోద్ తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో ఓవర్ లోడ్ కారణంగా వంతెన కూలిపోయిందని డివిజనల్ కమిషనర్ (జమ్మూ) రమేష్ కుమార్ తెలిపారు. 80 మంది గాయపడ్డారని, వీరిలో 20-25 మంది పరిస్థితి విషమంగా ఉందని చెనాని మున్సిపాలిటీ చైర్మన్ మాణిక్ గుప్తా తెలిపారు. పలువురిని జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశామనీ, మిగిలిన వారు చెనానీలో ఉన్నారని, వారిని వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఇదే తరహాలో జమ్మూలో మరో ఘటన చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లా ఖనేతార్ గ్రామంలో ఓ ఇంటి పైకప్పు కూలిన ఘటనలో 43 మంది గాయపడ్డారు. ఖనేతార్ కు చెందిన ఓ వ్యక్తి మృతికి సంతాపం తెలిపేందుకు గ్రామస్తులు, బంధువులు ఇంట్లో గుమిగూడిన సమయంలో ఇంటి పైకప్పు కూలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించామనీ, అక్కడ వారికి వైద్య చికిత్స అందించామని, క్షతగాత్రుల్లో చాలా మందిని వైద్య సహాయం అనంతరం డిశ్చార్జ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వారు తెలిపారు.
పూంచ్ జిల్లాలో మరో ఘటనలో మినీ బస్సు బోల్తా పడటంతో 27 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు రాంనగర్ నుంచి సుర్ని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాపాడారు. క్షతగాత్రులను రాంనగర్ సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
