విషాదం.. గంగా నదిలో సాన్నానికి వెళ్లి.. నీట మునిగి ఐదుగురు బాలుర దుర్మరణం..
గంగానదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఐదుగురు బాలురు నీట మునిగి చనిపోయారు. వీరి అందరి వయస్సు 14 నుంచి 17 ఏళ్ల లోపే ఉంటుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో చోటు చేసుకుంది.
ఆ ఐదుగురు బాలురు స్నేహితులు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న గంగానదిలోకి స్నానం చేసేందుకు వెళ్లాలని భావించారు. ఐదుగురు కలిసి నది వద్దకు వెళ్లారు. స్నానం చేస్తున్న క్రమంలో ఓ బాలుడు నీట మునిగాడు. ఆ బాలుడిని కాపాడేందుకు వెళ్లి మిగితా నలుగురు కూడా నీట మునిగి మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలో ప్రయాగ్ రాజ్ జిల్లాలోని మయూరాబాద్, బెలి కచర్ గ్రామాలకు చెందిన హిమాన్షు (16), ప్రియాంషు (16), ఆకాష్ (14), షాని (17), ములాయం (17) స్నేహితులు. వీరు ఐదుగురు స్నానం చేసేందుకు శివకుటి ప్రాంతంలో ఉన్న గంగానదికి శుక్రవారం వెళ్లారు. అందరూ నదిలో దిగి స్నానం చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో హిమాన్షు అనే బాలుడు నీటిలో మునిగిపోవడం ప్రారంభించాడు. దీనిని మిగిలిన నలుగురు స్నేహితులు గమనించారు. ఆ బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. అయితే అనుకోకుండా ఈ నలుగురు స్నేహితులు కూడా ఆ నీటిలోనే మునిగిపోయారు. దీనిపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
గజ ఈతగాళ్ల సాయంతో బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయం తరువాత ఐదుగురు డెడ్ బాడీలు లభ్యం అయ్యాయి. కాగా.. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. బాలుర కుటుంబ సభ్యులకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒకే రోజు రెండు గ్రామాలకు చెందిన ఐదుగురు బాలురు మరణించడం స్థానిక గ్రామాల్లో విషాదాన్ని నింపింది.