కొద్దిరోజుల క్రితం మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన ప్రధాన నిందితురాలు ప్రభా మున్నీ గుర్తుందా..? జార్ఖండ్, ఢిల్లీ పోలీసులు ఎంతో శ్రమించి ఆమెను అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం ప్రభా గురించే రెండు రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు.

అటువంటి కిలాడీ లేడీ ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. జార్ఖండ్‌కు చెందిన ప్రభా మున్నీ ఎన్‌జీవో పేరిట ప్లేస్‌మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. జార్ఖండ్‌లోని అందమైన మహిళలకు ఉద్యోగాలను ఎరవేసి వారిని ఢిల్లీకి పిలిపించి మానవ అక్రమ రవాణా చేసే వారికి విక్రయించేది.

ఈ వ్యవహారంలో ఆమెపై పలు కేసులు ఉన్నాయి.. పోలీసుల నిఘా ఎక్కువవ్వడంతో.. 2013 నుంచి ఆమె పరారీలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ప్రభా మున్నీని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఆమె అరెస్ట్ అయిన తర్వాతి రోజే ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ప్రస్తుతం జార్ఖండ్ పోలీసుల అదుపులో ఉన్న ప్రభా మున్నీ... ఎంతమంది అమ్మాయిలను విక్రయించిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.