శ్రీనగర్:జమ్మూకాశ్మీర్ లోని అవంతీపురలో ఉగ్రవాది రియాజ్ నాయక్ ను భద్రతా దళాలు బుధవారం నాడు ఉదయం అరెస్టు చేశాయి. అతడిని హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ గా పోలీసులు ప్రకటించాయి.

అతడిపై రూ. 12 లక్షల రివార్డు ఉన్నట్టుగా భద్రతా దళాలు ప్రకటించాయి. ఈ ప్రాంతంలోని టెర్రరిస్టు గ్రూపులకు రియాజ్ పెద్ద దిక్కుగా ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

అవంతిపురలో  ఉగ్రవాదుల కోసం నిర్వహించిన వేటలో  అతను చిక్కాడని పోలీసులు ప్రకటించారు. మంగళవారం నాడు రాత్రి ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. ఈ సమయంలో ఉగ్రవాదుల్లో అగ్రనేత ఉన్నారని సమాచారం అందిందన్నారు.

భద్రతాదళాల దాడుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. రియాజ్ పోలిసులకు చిక్కాడు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో అవంతీపురలో ఉందని పోలీసులు తెలిపారు.  ఆర్మీకి చెందిన 50ఆర్ఆర్, సీఆర్‌పీఎఫ్ కు చెందిన బిఎన్ 185, పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయని పోలీసులు ప్రకటించారు.

కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరిన ఘటనలో సీఆర్‌పీఎఫ్ 181 బెటాలియన్ కు చెందిన ఓ జవాన్  మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. జవాన్ తో పాటు నలుగురు పౌరులకు కూడ గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకొంది.  

దోడా జిల్లాలోని గుండావా ప్రాంతంలో ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకొంది. అరెస్ట్ చేసిన ఉగ్రవాదిని తన్వీర్ అహ్మద్ మాలిక్ గా గుర్తించారు.