Asianet News TeluguAsianet News Telugu

ఎలక్టోరల్ బాండ్లను విరాళమిచ్చిన టాప్ టెన్ కంపనీలివే... పొందిన పార్టీలివే... 

ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆసక్తికర సమాచారాన్ని బయటపెట్టింది. ఏ కంపనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసాయి... ఏ రాజకీయ పార్టీకి విరాళంగా ఇచ్చాయన్న వివరాలను ఎస్బిఐ ప్రకటించింది.  

Top Ten donors and beneficiaries of Electoral bonds  AKP
Author
First Published Mar 22, 2024, 4:48 PM IST

న్యూడిల్లీ : రాజకీయ పార్టీలు కార్పోరేట్ కంపనీల నుండి అధికారికంగా నిధులు సమీకరించుకునేందుకు తీసుకువచ్చినవే ఎలక్టోరల్ బాండ్లు. 2018 లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వీటిని తీసుకువచ్చింది. ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రైవేట్ కంపనీలు, వ్యక్తులు బ్యాంకుల నుండి వీటిని కొనుగోలుచేసి రాజకీయ పార్టీలను విరాళంగా ఇస్తాయి... వీటిని ఆ పార్టీలు బ్యాంకులద్వారా నగదుగా మార్చుకుంటాయి. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్లపై పారదర్శకత లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో సుప్రీంకోర్టు ఇటీవల వీటిని రద్దుచేసింది. అంతేకాదు ఈ బాండ్ల వివరాలను తెలియజేయాల్సిందిగా ఎస్బిఐ బ్యాంకును న్యాయస్థానం ఆదేశించింది.  

అయితే ఎట్టకేలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టుకు అందించింది. ఈ సమాచారం ప్రకారం ఏకంగా రూ.12,145 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు తెలుస్తోంది.   ఇలా ఎలక్టోరల్ బాండ్లను అందించిన టాప్ టెన్ దాతలు, తీసుకున్న పార్టీల వివరాలిలా ఉన్నాయి. 

ఎలక్టోరల్ బాండ్లు అందించిన టాప్ టెన్ కంపనీలు... అందుకున్న పార్టీలివే : 

ఎస్బిఐ అందించిన సమాచారం మేరకు... లాటరీ కింగ్ సెబాస్టియన్ మార్టిన్ ఫైర్మ్ ఫ్యూచర్ గేమింగ్ ఆండ్ హోటల్ సర్విసెస్ అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సంస్థ రూ. 1,365 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలుచేసింది. ఆ తర్వవాత మెఘా ఇంజనీరింగ్ ఆండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపనీ రూ.966 కోట్లు, రిలయన్స్ సంస్థకు చెందిన క్విక్ సప్లై చెయిన్ రూ. 410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. 

ఇక వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు,  ఆర్పి సంజీవ్ గోయంక గ్రూప్స్ కి చెందిన థర్మల్ ప్లాంట్ కంపనీ హల్దియ ఎనర్జి లిమిటెడ్ రూ. 377 కోట్లు,  మైనింగ్ కంపనీ ఎస్సెల్ మైనింగ్ రూ.224 కోట్లు,  వెస్ట్రన్ యూపి పవర్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ రూ.220 కోట్లు,  భారతి ఎయిర్ టెల్ రూ.198 కోట్లు, కోల్ కతా కు చెందిన ఎఫ్ఎమ్ సిజి గ్రూప్  కెవెంటర్స్ ఫుడ్ పార్క్ లిమిటెడ్ 195 కోట్లు,  స్టీల్ కంపనీ ఎంకెజె ఎంటర్ ప్రైజెస్ 192 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. 

ఇక ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధికంగా లాభపడ్డది అధికార బిజెపియే అన్నది ఎస్బిఐ లెక్కలు చెబుతున్నాయి. గత ఆరు సంవత్సరాలుగా ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపికి రూ.6000 కోట్ల నిధులు సమకూరినట్లు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ కంపనీయే బిజెపికి అత్యధికంగా విరాళం ఇచ్చింది.  ఇది ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బిజెపికి రూ. 519 కోట్లు ఇచ్చింది. అలాగే క్విక్ సప్లై కంపని రూ.375,  వేదాంత రూ.226, భారతి ఎయిర్ టెల్ రూ.183 కోట్ల రూపాయలను బిజెపికి విరాళంగా ఇచ్చాయి.  

బిజెపి తర్వాత ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధికంగా లాభపడ్డది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ లాటరీ గేమింగ్ కంపనీ ద్వారా రూ.542 కోట్లు పొందింది. అలాగ హల్దియా ఎనర్జీ రూ.281 కోట్లు, ధరివల్ ఇన్ఫ్రా రూ.90 కోట్లు, ఎంకేజే ఎంటర్ ప్రైజెస్ రూ.45 కోట్లు విరాళంగా ఇచ్చింది. 

ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లాభపడ్డ పార్టీల్లో కాంగ్రెస్ మూడోస్థానంలో వుంది. అ పార్టీకి వేదాంత కంపనీ 125 కోట్లు, ఎంకేజె గ్రూప్ రూ.91, యశోద హాస్పిటల్స్ రూ.64, అవీస్ ట్రేడింగ్ ఆండ్ ఫైనాన్స్ రూ.53 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. అలాగే ఫ్యూచర్ గేమింగ్ కంపనీ కాంగ్రెస్ కు కూడా రూ.50 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చింది. 

తెలుగు పార్టీలకు అందిన విరాళాలు :

ఇక తెలంగాణలో గత పదేళ్లు అధికారంలో వున్న బిఆర్ఎస్ పార్టీకి కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందాయి. మెఘా ఇంజనీరింగ్ సంస్థ, యశోద హాస్పిటల్స్ బిఆర్ఎస్ కుఅత్యధిక విరాళాలు ఇచ్చిన కంపనీలు. చెన్నయి గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ రూ.32 కోట్లు, హెటిరో డ్రగ్స్ రూ.30 కోట్లను బిఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చింది. 

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో వున్న వైసిపికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ.37 కోట్లను విరాళంగా ఇచ్చింది. ఇదే సంస్థ తెలుగుదేశం పార్టీకి కూడా రూ.28 కోట్లను విరాళంగా ఇచ్చింది. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ రూ.154 కోట్లను వైసిపికి విరాళంగా ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios