న్యూఢిల్లీ: అట్లాస్ సైకిల్స్ కంపెనీ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ భార్య నటాషా కపూర్ ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని ఔరంగజేబ్ లేన్ లో గల తన ఇంటిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. 

తాను వెళ్లిపోతున్నానని, మిమ్మిల్ని మీరు జాగ్రత్త చూసుకోండని 57 ఏళ్ల నటాషా కపూర్ తన సూసైడ్ నోట్ లో రాసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు తమకు ఆత్మహత్య గురించి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. 

ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో కూతురు, కుమారుడు ఇంట్లోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె భర్త సంజయ్ మాత్రం ఇంట్లో లేరని సమాచారం. మధ్యాహ్న భోజనం కోసం డైనింగ్ టేబుల్ వద్దకు రావాలని పిలువడానికి తాను మంగళవారంనాడు తన తల్లికి రెండుసార్లు మొబైల్ ద్వారా కాల్ చేశానని, అయితే ఆమె ఫోన్ ఎత్తలేదని కపూర్ కుమారుడు సిద్ధాంత్ చెప్పారు. 

దాంతో తాను వెళ్లి చూశానని, గది తలుపులు మూసి ఉన్నాయని, లోపలి నుంచి లాక్ మాత్రం చేసుకోలేదని ఆయన చెప్పారు తలుపులు తట్టినా లోపలి నుంచి సమాధానం రాలేదని, దాంతో లోనికి వెళ్లి చూశానని, దుపట్టాతో ఉరేసుకుని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిందని ఆయన చెప్పారు. 

పని మనుషుల సాయంతో మెడకు చుట్టుకున్న దుపట్టాను తీసి ఆమెను పడకపైకి చేర్చి సిపీఆర్ ప్రయత్నం చేశామని చెప్పారు. ఆమెను చూసిన సిద్దాంత్ ఆ విషయాన్ని ఇతర కుటుంబ సభ్యులకు చెప్పారని పోలీసులు అన్నారు. 

ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. ఆమె చేతిరాతను, సూసైడ్ నోటులోని విషయాలను పరిశీలిస్తున్నారని పోలీసులు చెప్పారు.