Asianet News TeluguAsianet News Telugu

Today Top 10 News : కేసీఆర్‌ భద్రత కుదింపు.. కాన్వాయ్ పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..నెలసరి సెలవులపై కవిత ఫైర్

Today Top 10 News : నేటి టాప్ 10 న్యూస్‌లో కేసీఆర్‌ భద్రత కుదింపు. సిద్దిపేట కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య,  బహిష్టు సెలవుల సవరణపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్, శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ డిశ్చార్జ్, తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ని ఆపవద్దంటూ సీఎం రేవంత్ ..తదితర అంశాల సమాహారం .   

Top 10 News 16 December 2023, Headlines,andhra pradesh  Updates, Telangana Updates KRJ
Author
First Published Dec 16, 2023, 5:55 AM IST

నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం 

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ని ఆపవద్దంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తాను ప్రయాణించే మార్గంలో కూడా ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం  కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు. 
 

మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ ఆదేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ శాఖపై సీఎం సమీక్షించారు.

యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్.. 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. పదేళ్ల తర్వాత నందినగర్ ఇంటికి వెళ్లారు. యశోద ఆసుపత్రి నుండి నేరుగా ఆయన ఆ ఇంటికి చేరుకున్నారు. ఈ నెల  7వ తేదీన  ఎర్రవెల్లిలోని  తన ఫామ్ హౌస్ బాత్రూంలో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాలు జారిపడ్డారు. దీంతో  ఆయన ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది.  అదే రోజున  హైద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను చేర్పించారు. ఈ నెల 8వ తేదీన యశోద ఆసుపత్రిలో  కేసీఆర్ కు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. 

కేసీఆర్‌ భద్రత కుదింపు
  
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రతను కుదించారు.  జడ్‌ కేటగిరి నుంచి వై ప్లస్‌కు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 1+4 చొప్పున రెండు షిఫ్టుల్లో ( 2+8 మంది భద్రత సిబ్బంది) ఆయనకు సిబ్బంది భద్రత కల్పించనున్నారు. కాగా.. బయటికి వెళ్లినప్పుడు పైలట్‌ ఎస్కార్ట్‌ భద్రత యథావిధిగా కొనసాగనుంది. చట్టసభల ప్రతినిధులు మాజీలుగా మారిన అనంతరం భద్రతను కుదించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నెలసరి సెలవులపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..

నెలసరి సెలవులపై ( menstrual leaves) రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Union Minister Smriti Irani) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) స్పందించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో తాను నిరుత్సాహపడ్డానని, ఇలాంటి అజ్ఞానాన్ని చూడటం దారుణమని అన్నారు. రుతుస్రావం రోజులకు వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం మహిళల నిజమైన బాధను విస్మరించడమేనని అన్నారు. రుతుస్రావం ఒక ఎంపిక కాదని చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో పోస్టు చేస్తూ..‘‘కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో రుతుస్రావ పోరాటాలను తోసిపుచ్చడం బాధాకరం. ఒక మహిళగా, అజ్ఞానాన్ని చూడటం భయంకరంగా ఉంది, ఎందుకంటే మన పోరాటాలు, మా ప్రయాణాలు ఓదార్పు కాదు, ఇది ఒక సమానమైన ఆటకు అర్హమైనది, అది రాజీపడలేనిది.’’ అని పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య..భార్య, పిల్లల్ని కాల్చి..
 
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్య, ఇద్దరు చిన్న పిల్లల్ని చంపేసి.. గన్ తో కాల్చుకుని నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామ నివాసి ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పీఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజులాగే విధులు పూర్తి చేసుకుని... ఇంటికి వచ్చే సమయంలో 9ఎంఎం పిస్టల్ తీసుకొచ్చాడు. దానితో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రి లను కాల్చి చంపేశాడు. ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నకోడూరు మండలం రాముని పట్లలో ఘటన జరిగింది. 


రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం 

రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఇటీవల జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురితో గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. జైపూర్ లోని ప్రఖ్యాత ఆల్బర్ట్ హాల్ వేదిక గా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే గోవా సీఎం ప్రమోద్ సావంత్, త్రిపుర సీఎం మాణిక్ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
 

లోక్ సభలో భద్రతా ఉల్లంఘన.. ప్రధాన సూత్రధారి అరెస్టు..

లోక్ సభ భద్రతా ఉల్లంఘన తో (lok sabha security breach)ఒక్క సారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. పటిష్టమైన బందోబస్తు ఉండే పార్లమెంట్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన లలిత్ మోహన్ ఝా (Lalit Mohan Jha)ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అతడు పోలీసుల ఎదుట లొంగిపోగా.. అదుపులోకి తీసుకున్నారు. అతడి వెంట మరో వ్యక్తి కూడా ఉన్నాడు. కాగా.. భారీ భద్రతా ఉల్లంఘనకు పాల్పడినందుకు నలుగురు వ్యక్తులపై కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఎపిఎ) కింద తీవ్రవాదం అభియోగాలు మోపారు. ఈ నలుగురిలో సాగర్ శర్మ, మనోరంజన్ డి అనే ఇద్దరు లోక్ సభ ఛాంబర్ లోకి స్మోక్ బాక్స్ లను తీసుకొచ్చినవారు. మిగిలిన ఇద్దరు నీలం దేవి, అన్మోల్ షిండే బయట నిరసన తెలిపారు.

అంగన్‌వాడీలతో చర్చలు విఫలం.. 

ఆంధ్రప్రదేశ్ లో వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని తదితర 11 డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగిన నేపథ్యంలో అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కానీ, ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి.  అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. జీతాలు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చి లేదని చెప్పడంతో అంగన్‌వాడీలు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సర్కారుహెచ్చరించడం గమనార్హం.

కేంద్ర బృందంతో సీఎం జగన్‌ భేటీ.. మిచౌంగ్ తుఫాన్‌ నష్టం అంచనా.. 
 
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తో తుఫాన్‌ , కరువులపై పరిశీలన చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాలు భేటీ అయ్యాయి. సీఎంతో తుఫాన్‌, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు అధికారుల బృందాలు సమావేశమయ్యాయి. క్షేత్ర స్థాయి అంశాలపై చర్చించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించి..అక్కడి పరిస్థితులను కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర బృందం తెలిపింది. అలాగే.. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని పేర్కొన్నాయి.విపత్తు నివారణ చర్యలు బాగున్నాయని వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios