Asianet News TeluguAsianet News Telugu

కెరీర్ తొలినాళ్ళలో సాయం.. ట్రక్ డ్రైవర్లను వెతికి పట్టుకున్న మీరాబాయి చాను..

నాంగ్ పోక్ కాక్ చింగ్ గ్రామంలోని మీరాబాయి చాను ఇంటినుంచి ఇంఫాల్ లోని ఖుమన్ లంపక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు 25 కిలోమీటర్ల దూరం. అప్పట్లో ఆమె శిక్షణ కోసం ఇంఫాల్ వెళ్లేందుకు ఇసుక ట్రక్కులను ఆశ్రయించేది. వారు కూడా ఆమెను ఎక్కించుకుని ఉచితంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద దింపేవారు. 

Tokyo Olympics: Mirabai Chanu finally finds truck drivers who helped her during budding days as weightlifter
Author
Hyderabad, First Published Aug 6, 2021, 9:47 AM IST

ఇంఫాల్ : ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చాను ఎట్టకేలకూ ట్రక్ డ్రైవర్లను కనుగొనగలిగింది. వెయిట్ లిఫ్టర్ గా తాను ఎదగడానికి తొలినాళ్లలో వారే కారణమయ్యారంటూ ఒలింపిక్స్ లో విజయం సాధించిన అనంతరం చాను వారిని గుర్తుచేసుకుంది. ఇండియాలో అడుగుపెట్టాక వారిని కలుస్తానని పేర్కొంది. 

అన్నట్టుగానే వారికోసం వెతుకులాట ప్రారంభించిన చాను విజయవంతమయ్యింది. నాంగ్ పోక్ కాక్ చింగ్ గ్రామంలోని మీరాబాయి చాను ఇంటినుంచి ఇంఫాల్ లోని ఖుమన్ లంపక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు 25 కిలోమీటర్ల దూరం. అప్పట్లో ఆమె శిక్షణ కోసం ఇంఫాల్ వెళ్లేందుకు ఇసుక ట్రక్కులను ఆశ్రయించేది. వారు కూడా ఆమెను ఎక్కించుకుని ఉచితంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద దింపేవారు. 

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మీరా కుటుంబానికి ఇది చాలా వెసులుబాటును ఇచ్చింది. వారి సాయాన్ని గుర్తుంచుకున్న 26 యేళ్ల మీరా చాను టోక్యో నుంచి తిరిగి వచ్చాక ఆ రోజుల్లో తనకు సాయం చేసిన ట్రక్ డైవర్ల కోసం వెతుకులాట ప్రారంభించింది. 

అప్పట్లో తనను ఇంఫాల్ తీసుకెళ్లిన ట్రక్ డ్రైవర్లను ఎట్టకేలకు గుర్తించిన మీరాబాయి కుటుంబం గురువారం నాడు గ్రామంలోని తమ నివాసంలో కొందరు ట్రక డ్రైవర్లను సన్మానించింది. ఆ తరువాత వారికి బహుమానాలు అందించింది. 

గ్రామంలో టీ స్టాల్ నడుపుతున్న మీరాబాయి చాను తల్లి సైఖోమ్ ఒంగ్బి టోంబి దేవి మాట్లాడుతూ.. అప్పట్లో ఇసుక ట్రక్కులు ఎథామ్ మొయిరాంగ్ పురెల్ ప్రాంతం నుంచి వస్తూ తమ ప్రాంతం మీదుగా వెళ్లేవని గుర్తు చేసుకున్నారు. ట్రక్ డ్రైవర్లు తమ టీ దుకాణం వద్ద ఆగి తన కుమార్తెను ఎక్కించుకుని వెళ్లేవారని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios