Asianet News TeluguAsianet News Telugu

ప్రెషర్ కుక్కర్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. ఆపరేషన్‌లో వైద్యులతోపాటు మెకానిక్

ఆగ్రాలో ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రెషర్ కుక్కర్‌లో తలపెట్టడంలో అటే ఇరుక్కుపోయింది. ప్రెషర్ కుక్కర్‌ను తొలగించడానికి కుటుంబ సభ్యులు నానా ప్రయత్నాలు చేశారు. కానీ విఫలం కావడంతో పిల్లాడిని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. వైద్యులు ఓ మెకానిక్ సహాయం తీసుకుని విజయవంతంగా ప్రెషర్ కుక్కర్‌ను కట్ చేసి తొలగించారు.

toddlers head stucked in pressure cooker, agra doctors successfully freed with the help of mechanic
Author
Agra, First Published Aug 29, 2021, 2:34 PM IST

ఆగ్రా: చిన్నపిల్లలకు ప్రతీది వింతే. అన్నింటిని తరచి చూస్తారు. తెరిచి చూస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ చిన్నారి ప్రెషర్ కుక్కర్‌ను తెరవడమే కాదు, అందులో తలదూర్చి మరి చూశాడు. తల దూరింది కానీ, బయటకు రాకుండా ఇరుక్కుపోయింది. కుటుంబీకులు పిల్లాడిని హాస్పిటల్‌కు చేర్చారు. రెండు గంటలపాటు ప్రయాసపడి వైద్యులు ప్రెషర్ కుక్కర్ నుంచి పిల్లాడి తలను వేరు చేయగలిగారు. ఈ ‘ఆపరేషన్’లో ఓ మెకానిక్ కూడా పాల్గొనడం గమనార్హం.

ఏడాదిన్నర వయసున్న పిల్లాడు తమ బంధువుల ఇంట్లో అడుకుంటున్నాడు. ఇలా ఆడుకుంటూ ప్రెషర్ కుక్కర్‌తోనూ ఆటలాడాడు. అందులో తలదూర్చడంతో ఇరుక్కుపోయింది. తొలుత కుటుంబ సభ్యులే తల నుంచి ప్రెషర్ కుక్కర్‌ను వేరు చేయడానికి ప్రయాస పడ్డారు. కానీ, ఫలితం దక్కలేదు. తప్పేది లేక ప్రెషర్ కుక్కర్‌లో తల ఇరుక్కున్న పిల్లాడిని అలాగే సమీపంలోని ఎస్ఎం చారిటబుల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

ప్రెషర్ కుక్కర్‌ను వేరు చేయడం వైద్యులకు అంత సులువుగా సాధ్యపడలేదు. ఇందుకోసం ఓ మెకానిక్‌నూ రప్పించారు. మెకానిక్ గ్రైండర్ మెషీన్‌తో హాస్పిటల్ చేరుకున్నాడు. దాదాపు రెండు గంటలు కష్టపడి ఈ ఆపరేషన్ సక్సెస్ చేశారు. కుక్కర్‌ను గ్రైండర్ హెల్ప్‌తో కట్ చేసినట్టు డాక్టర్ పర్హత్ ఖాన్ వెల్లడించారు. అన్నీ సేఫ్టీ నిబంధనలు పాటించే ప్రెషర్ కుక్కర్‌ను తొలగించినట్టు తెలిపారు. తాము పిల్లాడి తలను సురక్షితంగా ప్రెషర్ కుక్కర్ నుంచి బయటకు తీయగలిగామని చెప్పారు.

వైద్యులకు పిల్లాడి కుటుంబ సభ్యలు ధన్యవాదాలు తెలిపారు. వైద్యుల బృందానికి కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. వారి కృషి వల్లే ఇప్పుడు తమ చిన్నారి సురక్షితంగా ఉన్నాడని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios