Today’s News Roundup 19th August 2025: ఇవ్వాళ్టి వార్తల్లోని ప్రధానాంశాలు పుతిన్-జెలెన్‌స్కీ భేటీకి ఏర్పాట్లు ప్రారంభం, సీఈసీపై ఇండియా కూటమి అభిశంసన యోచన, శ్రీకృష్ణ రథయాత్రలో అపశ్రుతి, అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.904 కోట్లు
Today’s News Roundup 19th August 2025: ఇవ్వాళ్టి వార్తల్లోని ప్రధానాంశాలు
పుతిన్-జెలెన్‌స్కీ భేటీకి ఏర్పాట్లు ప్రారంభం – ట్రంప్ కీలక ప్రకటన
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ప్రకారం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మధ్య భేటీకి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్‌లర్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె తదితర యూరోపియన్ నేతలతో జరిగిన సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు ఇవ్వాలనే అంశంపై యూరోపియన్ దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని ఆయన వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడి, జెలెన్‌స్కీ–పుతిన్ భేటీపై చర్చించానని, ఈ సమావేశం ఎక్కడ జరగాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో ఈ భేటీ జరగనుందని ట్రంప్ వివరించారు. సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇది చారిత్రాత్మక ముందడుగు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష కూటమి బిగ్ ఫ్లాన్... ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన
దేశ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, భారీ స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని, డేటా తారుమారు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా బెంగళూరు సెంట్రల్‌లోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1,00,250 "దొంగిలించబడిన" ఓట్లు బీజేపీ విజయానికి కారణమయ్యాయని రాహుల్ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు, ఒకే చిరునామాలో అనేక ఓటర్ల నమోదులు, చెల్లని చిరునామాలు ఉన్నాయని ఆయన ఎత్తిచూపారు. అలాగే పోలింగ్ బూత్‌ల సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజ్‌ను కేవలం 45 రోజుల్లోనే డిలీట్ చేశారని ఆరోపించారు.
ఇక ఈ ఆరోపణలకు ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఆరోపణలను "నిరాధారమైనవి, రాజ్యాంగాన్ని అవమానించేవి" అని తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ ఏడు రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని, లేకుంటే దేశానికి క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. "సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, ఎవరైనా వేరుగా చెబితే అది నిజం కాదు" అంటూ గట్టి వ్యంగ్యం కూడా విసిరారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి మరో ముందడుగు వేసే ఆలోచనలో ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు
తెలంగాణలో వర్షాల ప్రభావం మరింతగా పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం త్వరలోనే బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం( నేడు) ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడుకుని ఉండే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.
శ్రీకృష్ణ రథయాత్రలో అపశ్రుతి... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
Hyderabad : శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు... మరికొందరు ప్రాణాపాయస్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రామంతాపూర్ ఘటనలో బాధిత కుంటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయి మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. అలాగే గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని... వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
గత శనివారం (ఆగస్ట్ 16) హిందువుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. అయితే హైదరాబాద్ లోని రామంతాపూర్ లో మాత్రం తర్వాతరోజు అంటే ఆదివారం కృష్ణాష్టమి వేడుక నిర్వహించారు. గోఖలే నగర్ ప్రాంతానికి చెందినవారంతా రథంపై శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అలంకరించి చేతులతో లాగుతూ ఊరేగింపు చేపట్టారు. ఈ ఘటనలో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి మృతిచెందారు... వీరంతా 40 ఏళ్లలోపు వయసువారే. కృష్ణాష్టమి వేడుకల్లో వీరి మరణం కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఆదివారం రాత్రి 12గంటల సమయంలో జరిగింది... సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముందుగా క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.904 కోట్లు
రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా గ్రామకంఠాల్లోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు సీఆర్‌డీఏ అథారిటీ 51వ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించారు. మంగళగిరిలో 78.01 ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణ చేపట్టాలని తీర్మానించారు. అలాగే, రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, ఐకానిక్ బ్రిడ్జి వంటి ప్రధాన ప్రాజెక్టుల పనుల కోసం ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ (SPV) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
భూములిచ్చిన రైతులకు నష్టం కలగకుండా రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో "అసైన్‌డ్" పదాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యా రంగ అభివృద్ధిలో భాగంగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, విట్లకు డెంటల్, మెడికల్, పారా మెడికల్ కళాశాలల కోసం చెరో 100 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు సంస్థలు 17 వేల మందితో నడిచిన తరువాత అదనపు భూమి కేటాయింపుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం – ప్రియురాలు హరిణి రెడ్డితో కొత్త జీవితం ప్రారంభం
ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నాళ్లుగానో ప్రేమలో ఉన్న తన ప్రియురాలు హరిణి రెడ్డితో రాహుల్ నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వేదికలో, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొంతమంది సినీ మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వేడుకను సింపుల్‌గా నిర్వహించినప్పటికీ, అక్కడి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ కావడంతో కాసేపట్లోనే వైరల్ అయ్యాయి.
ఈ వేడుకలో రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీ ధరించి మెరిసిపోగా, హరిణి ఆరెంజ్ లెహంగాతో అందరినీ ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి సంబంధం లేని హరిణితో రాహుల్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ ప్లే బ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించి, అనేక హిట్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యారు. బిగ్ బాస్ విన్నర్‌గా మరింత పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా RRR సినిమాలోని “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో రాహుల్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
