Today Top 10 News 17 December 2023: ఈ రోజు టాప్ 10 న్యూస్‌లో మేడిగడ్డ అన్నారంలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత .   

Today Top 10 News: మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ..

CM Revanth: మేడిగడ్డ ,అన్నారం బ్యారేజ్‌ల లీకేజ్‌లు, పిల్లర్లు కుంగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడిగడ్డ, అన్నారం ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించారు. తెలంగాణ శాసనమండలిలో సుదీర్ఘంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి .. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో, ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని.. కాంట్రాక్టులు ఎవరిచ్చారు, వారి వెనకున్న మంత్రులు ఎవరు..? అధికారుల పాత్ర సహా అన్నీ బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. 

ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్లే సభలోనూ : సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్

Harish Rao: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) కీలక వ్యాఖ్యాలు చేశారు. సభలో మాట్లాడుతూ సత్యదూరమైన విషయాలు వెల్లడించారని మండిపడ్డారు. సభ వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం లభించింది. శాసన సభలో, శాసన మండలిలోనూ ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం లభించింది. శాసన మండలిలో ఈ తీర్మానానికి ఆమోదం లభించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.గవర్నర్ స్పీచ్ అభ్యంతరకరంగా ఉన్నదని, ఆమె ప్రసంగంలో ఉపయోగించిన నిరంకుశ, నిర్బంధ ప్రభుత్వంగా దూషణలు సమర్థనీయం కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ పదాలను రికార్డుల్లో నుంచి తొలగించాలని తాను సవరణ పెట్టానని వివరించారు. రెండు సార్లు ప్రజల తీర్పుతో అధికారాన్ని బీఆర్ఎస్ చేపట్టిందని, అలాంటి ప్రభుత్వాన్ని దూషణలు చేయడం సరికాదని ఆగ్రహించారు.


సీఎం ఆఫర్ తిరస్కరించిన మాజీ డీఎస్పీ నళిని!

Dsp Nalini: ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామా మాజీ డీఎస్పీ నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కానీ, ఓ న్యూస్ చానెల్‌తో ఫోన్‌లో మాట్లాడిన మాజీ డీఎస్పీ నళిని ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. రాజీనామా చేసి నేను రాజకీయ నేతల నుంచి తప్పించుకున్నాను. నా ఉద్యోగం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేదు. కాబట్టి, దయచేసి తనను డిస్టర్బ్ చేయవద్దు అని ఆమె విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్‌పోర్ట్‌లు సీజ్ చేయాలి: బండి సంజయ్

BandiSanjay: కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను సీజ్ చేయాలని, లేనిపక్షంలో దేశం విడిచిపోయే ప్రమాదం వుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని బయటపెట్టాలని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలని.. కేసీఆర్ సీఎంగా వుండగా, సీఎంవోలో పదవీ విరమణ చేసిన అధికారులు అడ్డగోలుగా సంపాదించి ప్రజల ఆస్తులను దోచుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార భవనాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. 

Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ‘‘సూరత్ డైమండ్ బోర్స్’’ను ప్రధాని నరేంద్ర మోడీ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం డైమండ్ బిజినెస్‌కు డెస్టినేషన్‌గా మారనుంది. ఈ డైమండ్‌ బోర్స్‌ 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 9 గ్రౌండ్ టవర్లు, 15 అంతస్తుల్లో దీని నిర్మాణం చేపట్టారు. ఇందులో 4500 కార్యాలయాలు వున్నాయి. ఈ డైమండ్ బోర్స్ .. పెంటగాన్‌లో వున్న భవనం కంటే పెద్దది. డైమండ్ కేపిటల్‌గా ప్రఖ్యాతి గాంచిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. ఇప్పుడు నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్‌ దాదాపు 65 వేల మంది వజ్రాల నిపుణులకు వేదికగా మారనుంది.

రాహుల్ గాంధీకి మరోసారి సమన్లు..

Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. గతంలో ప్రధాని మోడీపై వ్యాఖ్యలు చేసినందుకు గుజరాత్ కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ కోర్టు తీర్పుతో ఆయన పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరు వచ్చింది. తాజాగా, మరో కోర్టు నుంచి ఆయనకు సమన్లు వచ్చాయి. హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకుగాను ఈ సారి సమన్లు రావడం గమనార్హం. యూపీలోని సుల్తాన్‌పూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సమన్లు పంపింది. జనవరి 6వ తేదీన కోర్టులో హాజరు కావాలని ఆదేశించినట్టు ఓ కౌన్సెల్ తెలిపారు. గతంలోనే ఈ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు పంపింది. శనివారం ఆయన కోర్టులో హాజరు కావాలని ఆదేశించినా.. రాహుల్ గాంధీ హాజరు కాలేదు. దీంతో శనివారం తాజాగా మరోసారి సమన్లు పంపింది.

సఫారీలతో వన్డే సవాల్‌కు రాహుల్‌ సేన సిద్ధం

India vs South Africa : దక్షిణాఫ్రికా పర్యటనలో టీ-20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. కేఎల్ రాహుల్‌ నేతృత్వంలోని యువ భారత్‌ ఆదివారం జొహన్నెస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో తొలి వన్డేలో దక్షిణాఫ్రికా తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరీస్‌లో శుభారంభం చేయాలని టీమిండియా కసితో ఉంది. అయితే.. మెుదటి వన్డే జరిగే వాండరర్స్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు.. ఈ మైదానంలో అతిథ్య జట్టుకు మెరుగైన రికార్డు ఉండటంతో టీమిండియా కాస్తా కలవరపడుతోంది. 

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే..టాప్ 3 లో ప్రశాంత్,అమర్,శివాజీ ? 

Bigg Boss 7 Telugu Grand Finale: మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ రోజు ఎపిసోడ్ తో బిగ్ బాస్ 7 ముగియనుంది. నేటి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో హోస్ట్ విజేతను ప్రకటించబోతున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం ఆరుగురు ఫైనలిస్ట్‌లు ఉన్నారు. వీళ్లలో అంబటి అర్జున్,ప్రియాంక,ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్, ప్రశాంత్ ఉన్నారు. లీక్స్ ప్రకారం.. శివాజీ మూడో స్థానం ఉండగా..ప్రశాంత్, అమర్‌ ఇద్దరిలో విన్నర్ ఎవరో? రన్నర్? తేలియాల్సి ఉంది.