తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక దేశానికి సాయం చేసేందుకు తమిళనాడు రాష్ట్రం ముందుకొచ్చింది. ఆ దేశానికి నిత్యావసర వస్తువులు పంపించేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 

న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు బియ్యం, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు, ఔషధాలతో సహా నిత్యావసర సరుకులను పంపించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం భావిస్తోంది. దీని కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. ఈ మేర‌కు త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఆయ‌న ఓ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దీనిని అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. 

ఈ అసెంబ్లీ స‌మావేశం సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేందర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ శ్రీలంకకు అనేక సహాయ సహకారాలు, ప్రయోజనాలు అందించారని కొనియాడారు. ‘ఎంఈఏ ద్వారా మాత్రమే శ్రీలంకకు వస్తువులను పంపగలం. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం. శ్రీలంక సంక్షోభానికి తమ నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు.’’ అని ఆయ‌న అన్నారు.

ఈ నెల ప్రారంభంలో సీఎం స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. శ్రీలంక తమిళులకు రాష్ట్రం త‌రుఫున మానవతా సహాయం అందిస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌కు కేంద్ర అనుమ‌తించాల‌ని అభ్యర్థించారు. శ్రీలంక నుంచి పారిపోయి వచ్చి చాలా మంది తమిళనాడుకు చేరుకుంటున్నారని స్టాలిన్ తెలిపారు. ద్వీప దేశంలో ఆర్థిక సంక్షోభం మధ్య సముద్ర మార్గం గుండా రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. 14 పాయింట్ల డిమాండ్ల చార్టర్‌ను ప్రధానికి అందజేశారు. 

అయితే ఈ వలస సమస్యను చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై డీఎంకే ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందని సీఎం తెలిపారు. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక పౌరులు అక్కడి నుంచి పారిపోయి తమిళనాడుకు వస్తున్నారనే మీడియా కథనాలపై స్పందించిన సీఎం.. ఈ సమస్యను చట్టబద్ధంగా నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా దేశ ఆర్థిక సంక్షోభంపై అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు రాజీనామా చేయాలని శ్రీలంకలో పెద్ద ఎత్తున స‌మ్మె జ‌రిగింది. ఇది దేశంలో కార్య‌క‌ల‌పాల‌ను మొత్తం స్తంభింపజేసింది. కాగా 22 మిలియన్ల జనాభా ఉన్న ద్వీప దేశం ఆహారం, ఇంధనం, తీవ్ర మందుల కొరతతో ఇబ్బంది ప‌డుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం మ‌రింత ఎక్కువైంది. ఇది పర్యాటకాన్ని దెబ్బతీసింది. ప‌ర్యాట‌క రంగ‌మే శ్రీలంక దేశానికి ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉంది. ఈ ఆర్థిక సంక్షోభం నేప‌థ్యంలోనే చాలా కాలం నుంచి అక్క‌డి పౌరులు ఆందోళ‌నలు చేస్తున్నారు. 

గురువారం జ‌రిగిన స‌మ్మెలో నిర‌స‌నకారులు రాజపక్స వంశాన్ని నిందించారు. ఏళ్ల త‌ర‌బ‌డి అధికారాన్ని దుర్వినియోగం చేయ‌డం, నిర్ల‌క్ష‌పు పాల‌న విధానాల ఫ‌లితంగానే దేశం ఇప్పుడు ఈ ప‌రిస్థితి ఎదుర్కొంటోంద‌ని ఆరోపించారు. అందుకే క‌నీసం ఇప్పుడు దేశం తగినంత ఇంధనం, ఆహారం, ప్రాథమిక అవసరాలను కొనుగోలు చేయలేకపోతోంద‌ని విమ‌ర్శించారు.