వయనాడ్ ప్రకృతి విలయం సమయంలో మానవత్వాన్ని ప్రదర్శించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులకు, నాలుగు సంస్థలకు TNG అవార్డు లభించింది.  

తిరువనంతపురం: ఏసియానెట్ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ టి.ఎన్. గోపకుమార్ పేరు మీద TNG (టీఎన్జి) అవార్డును ప్రకటించారు. ఈ సంవత్సరం అవార్డు వయనాడ్ కొండచరియ విపత్తు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితం చేయబడింది. ఈ నెల 30న కల్పెట్టలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. గత సంవత్సరంలో మాదిరిగానే సామాజిక నిబద్ధత, కరుణ చూపిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును అందిస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు, నాలుగు సంస్థలు ఈ అవార్డును అందుకుంటున్నాయి.

వయనాడ్ విషాద సమయంలో చాలామంది మానవత్వం ప్రదర్శించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీరిలో కొందరు ఇతరులకు సాయం చేయబోయి తమ ప్రాణాలు కూడా కోల్పోయారు, మరికొందరు ప్రమాదం అని తెలిసినా ధైర్యంగా ప్రపంచానికి విపత్తు గురించి తెలియజేశారు, ఇలా విపత్తు సమయంలో మానవత్వం ప్రదర్శించిన కొంతమందికి ఈ సంవత్సరం TNG అవార్డులకు ఎంపికయ్యారు. ఆ అవార్డు పొందినవారి వివరాలివే...

1. ప్రజేష్

చూరల్మల-ముండక్కై విపత్తులో అనేక మందికి సహాయం చేసారు ప్రజీష్. అతను ఇతరులను కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేశాడు. జూలై 30న అసాధారణ భారీ వర్షపాతం నడుమ తాను పనిచేస్తున్న రిసార్ట్ నుండి పదిహేను మందిని చూరల్మల పట్టణానికి సురక్షితంగా తీసుకువచ్చిన 34 ఏళ్ల ప్రజీష్‌ను ముండక్కై, చూరల్మల ఎప్పటికీ మరచిపోలేవు. చూరల్మల స్కూల్ రోడ్డుపై ప్రజలు చిక్కుకుపోయారని తెలుసుకున్న ప్రజీష్ తన భద్రతను లెక్కచేయకుండా వారి సహాయానికి పరుగెత్తాడు. వీలైనంత ఎక్కువ మందిని తన జీపులో సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. రాత్రి 9 గంటలకు అతని సోదరుడు ప్రవీణ్ ఫోన్ చేసినప్పుడు నీటి మట్టం పెరుగుతోందని... ఇంకా చాలా మందిని రక్షించాల్సి ఉందని ప్రజీష్ చెప్పాడు. ఇలా సహాయ ప్రయత్నాల్లో వుండగా ప్రజీష్ జీపు కొండచరియలో కూరుకుపోయాయి. మరుసటి రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చూరల్మల స్కూల్ రోడ్డుపై అతని మృతదేహం లభ్యమైంది. విపత్తు సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మానవత్వాన్ని ప్రదర్శించి చివరకు ప్రాణాలు కోల్పోయాడు ప్రజేష్. అతడికి టిఎన్డి అవార్డు దక్కింది. 

2. నీతు

నీతు తన మరణానికి ముందు ఒక వాయిస్ మెసేజ్ ద్వారా చూరల్మల-ముండక్కై విపత్తు యొక్క తీవ్రత గురించి ప్రపంచానికి తెలియజేసింది. ముండక్కైలో మొదటి కొండచరియ నీతు ఇంటికి సమీపంలోని చాలా ఇళ్లను నాశనం చేసింది. ఆమె ఇల్లు సురక్షితంగా ఉండటంతో నిరాశ్రయులైన పొరుగువారికి ఆశ్రయం కలిగించింది. నీతు, ఆమె భర్త జోజో ఆశ్రయం కోరుకునే వారిని ఓదార్చే సమయంలో, రెండవ కొండచరియ విరుచుకుపడింది. అప్పుడు నీతు తాను పనిచేస్తున్న ఆసుపత్రికి వాయిస్ మెసేజ్ పంపింది. సహాయకర్తలు వచ్చేసరికి నీతు, ఇంట్లో ఉన్న మరో ఐదుగురు కూరుకుపోయారు. ప్రకృతి విపత్తు యొక్క భయానకత, మానవ నిస్సహాయతను వెల్లడించే నీతు మాటలు ముండక్కై-చూరల్మల ఎప్పటికీ మరిచిపోదు.

3. షైజా

వయనాడ్ విపత్తు ప్రారంభ రోజుల్లో ప్రతి ఒక్కరి మృతదేహాలను గుర్తించడం ప్రధాన సవాలు. సామాజిక కార్యకర్త అయిన షైజా చాలా మంది దగ్గరివారిని కోల్పోయినప్పటికీ మెప్పాడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిండిపోయిన మృతదేహాలను గుర్తించడంలో సహాయం చేసింది. వరుసగా 11 రోజుల పాటు షైజా వందకు పైగా మృతదేహాలను గుర్తించింది. ఆమె మెప్పాడి గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు కూడా.

4. హనీ

హనీ కథ అద్భుతమైన మనుగడ కథ. ఈ పదవ తరగతి విద్యార్థి విపత్తులో తన తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయినా తన అమ్మమ్మకు అండగా నిలిచి బతికాడు. హనీ ధైర్యానికి అతనికి ఇప్పటికే అనేక గుర్తింపులు లభించాయి.

5. ముబీనా

కొండచరియ వినాశనానికి ముబీనా ఒక జీవన సాక్ష్యం. ఆమె తీవ్ర గాయాలపాలై తన ఇద్దరు పిల్లలు, మామను కోల్పోయింది. ఆమె ఇప్పటికీ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతోంది.

6. అనూప్ థామస్

అటవీ శాఖ అధికారి అనూప్ థామస్ కొండచరియ తర్వాత వరదలకు గురైన సూచిపారా జలపాతం నుండి పిల్లలను ధైర్యంగా రక్షించాడు. అతని రెస్క్యూ దృశ్యాలు రెస్క్యూ కార్యకలాపాలకు చిహ్నంగా మారాయి. అనూప్, అతని బృందం చిక్కుకుపోయిన గిరిజన పిల్లలను కాపాడడానికి ధైర్యంగా జలపాతంలోకి ప్రవేశించారు.

 7. PTA ముండక్కై

గ్రామానికి వెలుగు బాటగా నిలిచి తరతరాలు ఆడుకున్న, చదువుకున్న ముండక్కై LP స్కూల్ విపత్తులో నాశనమైంది. అద్భుతమైన ఉపాధ్యాయులు-విద్యార్థుల సంబంధాలకు పేరుగాంచిన ఈ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విపత్తు తర్వాత వారి అవిశ్రాంత ప్రయత్నాలకు కేరళ ప్రజల ప్రేమ, గౌరవాన్ని సంపాదించారు.

8. PTA వెల్లరిమల

వయనాడ్‌లోని ఎత్తైన శిఖరం పాదాల వద్ద ఉన్న వెల్లరిమల హయ్యర్ సెకండరీ స్కూల్, పుతుమల, ముండక్కై, చూరల్మలను నాశనం చేసిన కొండచరియను పాక్షికంగా తట్టుకుని, చూరల్మలలోని ఒక భాగాన్ని, అనేక ప్రాణాలను కాపాడింది. రాష్ట్ర పాఠశాల కళోత్సవంలో వెల్లరిమల విద్యార్థులు తమ హృదయవిదారక అనుభవాలను వ్యక్తీకరించడాన్ని కేరళ చూసింది.

9. చూరల్మల కరుణ రెస్క్యూ

చూరల్మలలో సంవత్సరాలుగా ఉన్న ఈ రెస్క్యూ బృందం విపత్తుకు స్పందించిన వారిలో మొదటి వారు. కరుణ రెస్క్యూ కోఆర్డినేటర్ నసీర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. 2019 పుతుమల కొండచరియ సమయంలో కూడా వారు చురుగ్గా పనిచేశారు.

900 కాంది డ్రైవర్లు

విపత్తు జోన్‌కు చేరుకుని, బాధితులను ఆసుపత్రులకు తరలించిన వారిలో ఈ జీప్ డ్రైవర్లు మొదటి వారిలో ఉన్నారు. 2019 పుతుమల కొండచరియ సమయంలో కూడా వారు ఇదే పాత్ర పోషించారు.

విపత్తు ప్రాంతంలో సేవలందించిన వారిని సత్కారం

వయనాడ్ విపత్తు కేరళ సామూహికతను, మంచితనాన్ని వెల్లడించింది. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఏకమయ్యారు. DYFI, వైట్ గార్డ్స్, సేవా భారతి, యూత్ కాంగ్రెస్, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఇంకెందరో వ్యక్తులు సహాయ, ఉపశమన చర్యల్లో కలిసి పనిచేశారు. పంచాయతీ సభ్యులు, వివిధ యాక్షన్ కమిటీలు నాశనమైన ప్రాంతం కోలుకోవడానికి మార్గనిర్దేశం చేసి, మద్దతు ఇచ్చాయి.