ఓ బస్సులో వెళ్తున్న యువతికి ఓ యువకుడు బలవంతంగా తాళి కట్టాడు. కాగా... ఆ యువకుడిని పోలీసులు అరెస్టు  చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే... ఆంబూరు సమీపంలోని సాండ్రోర్ కుప్పం ప్రాంతానికి చెందిన జగన్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. గతంలో ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు.

అప్పటి  నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. అయితే... ఈ విషయం మాత్రం సదరు యువతికి చెప్పే ధైర్యం చేయలేదు. కాగా... ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు.. ఆమె తనకు దూరమౌతుందనే భయంతో.. తన ప్రేమ విషయం యువతికి తెలిజయేశాడు.

అప్పటికే ఆమెకు పెళ్లి నిశ్చయం కావడంతో... అతని ప్రేమను యువతి నిరాకరించింది. దీంతో.. తన ప్రేమను కాదన్నదని ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం యువతి ఆంబూరు నుంచి వాణియంబాడికి బస్సులో బయలుదేరగా.. అతను కూడా అదే బస్సు ఎక్కాడు. సీట్లో కూర్చొని ఉన్న యువతి వద్దకు వెళ్లి.. తన వెంట తెచ్చుకున్న తాళిని బలవంతంగా ఆమె మెడలో కట్టాడు. 

యువతి.. తాళి కట్టనివ్వకుండా పెనుగులాడుతూ గట్టిగా అరవడంతో.. ఆమెకి బస్సులోని ఇతర ప్రయాణికులు మద్దతుగా నిలిచారు. యువకుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.