Online Rummy Ban Emergency Law:: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ క్రీడ నిషేధం కోసం అత్యవసర చట్టాన్ని రూపొందించే నిమిత్తం మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
Online Rummy Ban Emergency Law: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ రమ్మీ (గ్యాంబ్లింగ్)కు వ్యతిరేకంగా అత్యవసర చట్టాన్ని తీసుకురావాలని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి కె చంద్రు నేతృత్వం వహించనున్నారు. ఇటీవల చెన్నైలో ఓ వివాహిత ఆన్ లైన్ రమ్మీకి బానిసై.. 20 సవార్ల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షలు పోగొట్టుకున్నది. చివరికి అప్పుల పాలై.. ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
మొదటి లాక్‌డౌన్ సమయంలో భవాని అనే వివాహిత ఆన్‌లైన్‌లో జూదం ఆడటం ప్రారంభించింది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ , ఆమె ఏదో ఒక రోజు పెద్ద మొత్తంలో సంపాదిస్తా.. అనే ఆశతో ఆన్‌లైన్ రమ్మీ గేమ్ ఆడుతూనే ఉంది. ఆన్‌లైన్‌లో జూదం ఆడేందుకు తన బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ, ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తాకట్టు పెట్టిన ఆభరణాలు తిరిగి తెచ్చుకుంటానని భవాని తన ఇద్దరు అక్కాచెల్లెళ్ల నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా కూడా తీసుకుంది. ఆ డబ్బును కూడా ఆన్ లైన్ రమ్మీలో పెట్టి పోగొట్టుకుంది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. భవాని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె చనిపోవడానికి 4 రోజుల ముందు, తాను డబ్బు పోగొట్టుకున్నానని, మళ్లీ ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడబోనని తన సోదరితో చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.
ఆన్‌లైన్ జూదం కారణంగా ఆత్మహత్యలు
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా తమిళనాడులో మరణాలు పెరుగుతున్నాయి. ఈ ఆంశం ప్రతిపక్ష రాజకీయ పార్టీలలో చర్చనీయాంశమైంది. ఎఐఎడిఎంకె కోఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం కూడా ఈ ఆంశాన్ని పలు సార్లు చర్చించారు. చాలా కుటుంబాలను వీధుల్లో పడటానికి కారణమైన ఆన్‌లైన్ జూదానికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు వ్యతిరేకంగా జూన్ 10న నిరసనకు వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ విభాగం పాటలీ మక్కల్ కట్చి (పిఎంకె) పిలుపునిచ్చింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో డబ్బు పోగొట్టుకుని గత 10 నెలల్లో రాష్ట్రంలో 22 మంది ఆత్మహత్య చేసుకున్నారని పీఎంకే అధ్యక్షుడు, కేంద్ర మాజీ ఆరోగ్య మంత్రి డాక్టర్ అన్బుమణి రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నియంత్రించేందుకు చట్టం చేయాలని కూడా కోర్టు సూచించారు.
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నియంత్రణకు న్యాయస్థానం చట్టం చేయాలని సూచించినా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంలో విఫలమైందని రాందాస్ అన్నారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నియంత్రించేందుకు చట్టం కోసం.. పార్టీ నిరంతరం ప్రచారం చేస్తోందని, ప్రభుత్వానికి అనేక మెమోరాండాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని పిఎంకె నాయకుడు అన్నారు. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ గతంలో జీరో అవర్‌లో రాజ్యసభలో ఆన్‌లైన్ గేమింగ్ అంశాన్ని లేవనెత్తారు. చట్ట ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 2021లో జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ సుశీల్ మోదీ రాజ్యసభలో ఇలా అన్నారు. ఆన్‌లైన్ గేమింగ్ ఆడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రధానంగా యువత బానిసలుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆన్‌లైన్ గేమింగ్ కోసం వెచ్చించే స్క్రీన్-టైమ్ 2.5 గంటల నుండి 4 గంటలకు పెరిగింది. ఈ ఆన్ గేమింగ్ ఆదాయం 2015లో 657 కోట్లు ఉండగా.. 2021 ఆర్థిక సంవత్సరంలో దాని ఆదాయం రూ. 29,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేయబడిందని, డౌన్‌లోడ్‌లో ఫోన్ల వినియోగం కూడా భారీగా పెరిగిందని చెప్పారు.
