చెన్నై: పెళ్లయిన తొలి రాత్రే ఆ దంపతులకు చివరి రాత్రి అయింది. కారణం తెలియదు గానీ... ఓ వ్యక్తి తొలి రాత్రే భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. బుధవారంనాడు ఆ ఘటన చోటు చేసుకుంది. 

తమిళనాడులోని ఆ గ్రామానికి చెందిన నీతి వాసన్ (24), సంధ్య (20)లకు బుధవారం రాత్రి వివాహమైంది. కరోనా వైరస్ కారణంగా కొద్ది మంది సమక్షంలోనే వివాహం జరిపించారు. నీతివాసన్, సంధ్య దంపతుల గది నుంచి అర్థరాత్రి పెద్దగా కేకలు వినిపించాయి. 

దాంతో కుటుంబ సభ్యులు గది తలుపులు తెరిచి చూశారు. సంధ్య రక్తం మడుగులో మరణించి ఉండడం వారికి కనిపించింది. సమీపంలోనే ఓ ఇనుప రాడ్ ఉంది. గదిలో నీతివాసన్ లేడు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

కత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు నీతి వాసన్ శవం వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని తురవళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో జరిగింది. నిధివాసన్ గంజాయికి, మంద్యానికి బానిసయ్యాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. విహహ నిశ్చయానికి ముందే మద్యానికి బానిసైన నీతివాసన్ మానసిక రోగిగా మారిపోయాడని, సాధారణ స్థితికి రావడానికి మూడు నెలల పాటు మానసిక వైద్యశాలలో చికిత్స కూడా తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. 

నీతివాసన్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పెళ్లి రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే యువతిని బాగా చూసుకుంటామని, నీతి వాసన్ మద్యం వైపు వెళ్లడని అతని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. దాంతోనే వివాహం జరిగింది.