చెన్నై: సరైన వైద్యం అందితే జయలలిత బతికేవారని తమిళనాడు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి  సీవీ షణ్ముగం సంచలన ప్రకటన చేశారు. అమ్మ మృతి వెనుక కుట్ర జరిగిందన్నారు. చికిత్స కోసం జయలలితను విదేశాలకు తరలించాలన్న ప్రయత్నాలను కూడ చెడగొట్టారని ఆయన ఆరోపించారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. జయలలితకు యాంజియోగ్రామ్ చేయకుండా అడ్డుకొన్న వారిపై కుట్ర కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమ్మ మృతిపై  మిస్టరీ వీడాలంటే సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టి  విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

2016 డిసెంబర్ 5వ తేదీన జయలలిత అపోలో ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో 72 రోజుల పాటు జయలలిత చికిత్స తీసుకొంది. జయ మృతిపై అనుమానాలు, ఆరోపణలు రావడంతో  అన్నాడీఎంకే సర్కార్  జస్టిస్ అరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.

జయలలితకు చికిత్స అందించే విషయంలో అపోలో ఆసుపత్రితో, వీకే శశికళ కుమ్మక్కయ్యారనేందుకు ఆధారాలు ఉన్నాయని అరుముగస్వామి కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ తరుణంలో తమిళనాడు న్యాయ శాఖ మంత్రి షణ్ముగం ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం కల్గిస్తున్నాయి.విచారణ కమిషన్ ఆరోపణలను అపోలో ఆసుపత్రి తీవ్రంగా ఖండించింది. ఈ కమిషన్  పలువురిని విచారించింది. ఈ కమిషన్ ఇంకా విచారణను కొనసాగించనుంది.