పరాక్రమానికి, గుండె ధైర్యానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన ఇద్దరు వృద్ధుల దమ్ముకి ప్రభుత్వం అవార్డునిచ్చి సత్కరించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాకు చెందిన షణ్ముగవేల్ ఈ నెల 12న తన ఇంటి ఇవరణలో కూర్చొన్నారు.

ఈ సమయంలో ఇద్దరు దొంగలు ఆయనపై కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన ఆయన వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో బయట గొడవ జరుగుతుండటాన్ని గమనించిన షణ్ముగవేల్ భార్య లోపలి నుంచి వచ్చి భర్తతో పాటు కొట్లాడింది. దీంతో దొంగలు తోకముడిచారు.

సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వీరి తెగింపు జిల్లా కలెక్టర్ శిల్ప ప్రభాకర్ దృష్టికి వెళ్లడంతో ఆమె సాహస పురస్కారం కోసం ఈ వృద్ధ దంపతుల పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

దీనిని పరిశీలించిన తమిళనాడు ప్రభుత్వం.. సాహస అవార్డును ప్రకటించింది. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి పళనిస్వామి వృద్ధ దంపతులకు అవార్డును ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా షణ్ముగవేల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందన్నారు. తమ ఫిర్యాదుపై వేగంగా స్పందించిన పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.