Asianet News TeluguAsianet News Telugu

గౌహతిలో శివసేన ఎమ్మెలు ఉన్న హోటల్ వద్ద హైడ్రామా.. సీన్‌లోకి టీఎంసీ ఎంట్రీ.. బీజేపీకి వ్యతిరేకంగా నిరసన

అస్సోంలోని గౌహతిలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది. సేన రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న రాడిసన్ బ్లూ హోటల్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

TMC workers protest against BJP in Guwahati hotel where shiv sena rebel stay
Author
First Published Jun 23, 2022, 11:58 AM IST

అస్సోంలోని గౌహతిలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది. సేన రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న రాడిసన్ బ్లూ హోటల్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టీఎంసీ అస్సోం యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు రిపున్ బోరా నిరసనకు నాయకత్వం వహించారు. వరదల వల్ల అస్సాం అతలాకుతలమైందని.. ఇక్కడేమో బీజేపీ హార్స్ ట్రేడింగ్ చేస్తోందని టీఎంసీ శ్రేణులు మండిపడ్డాయి. అస్సాం వరదలతో నష్టపోతే కేంద్రం ఒక్క పైసా కూడా పంపలేదని విమర్శించారు. 

‘‘అసోంలో దాదాపు 20 లక్షల మంది ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అస్సోం ముఖ్యమంత్రి మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో ఉన్నారు’’ అని టీఎంసీ కార్యకర్త ఒకరు విమర్శించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ వద్ద టీఎంసీ శ్రేణులు నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు.. పలువురు టీఎంసీ శ్రేణులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 

ఇక, కొంతకాలంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ కేంద్రం.. రాష్ట్రాల వ్యవహారాల్లో తల దూర్చుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సమాఖ్య నిర్మాణాన్ని కూలదోస్తోందని విమర్శిలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. శివసేన‌లో చీలక ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన‌కు ప్రస్తుతం 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా..  పార్టీ తమదిగా ప్రకటించుకోవాలంటే ఏక్‌నాథ్‌ షిండేకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుందని పలు ఆంగ్ల మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటికే 30కు పైగా శివసేన ఎమ్మెల్యేలు షిండే‌కు మద్దతుగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం శివసేనకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు..  ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరారు. దీపక్ కేశకర్ (సావంత్‌వాడి నుంచి ఎమ్మెల్యే), మంగేష్ కుడాల్కర్ (చెంబూర్ నుంచి ఎమ్మెల్యే) ,సదా సర్వాంకర్ (దాదర్ నుంచి)లు ఈ రోజు ఉదయం ముంబై నుంచి విమానంలో గౌహతికి చేరుకున్నారు. దీంతో ఏక్‌నాథ్ షిండే శిబిరంలోని శివసేన ఎమ్మెల్యేల సంఖ్య 36కి చేరిందని కథనాలు వెలువడుతున్నాయి. 

ఫిరాయింపుల నిరోధక చట్టాల కింద అనర్హత వేటు పడకుండా శివసేన పార్టీని చీల్చేందుకు షిండే శిబిరానికి ఇప్పుడు కేవలం ఒక్కరే కావాలి. ఒకవేళ ఇదే జరిగితే శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే.. మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంతో పాటు, పార్టీని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఏక్‌నాథ్ షిండే వెంట ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios