కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. దీనిని అరికట్టేందుకు అన్ని దేశాల్లోని శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం క్లినికల్ దశలో ఉన్న వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి డిసెంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

గత మూడు, నాలుగు నెలల నుంచి ప్రపంచానికి లాక్‌డౌన్, క్వారంటైన్, ఐసోలేషన్ వంటి పదాలే నోట్లో నానుతున్నాయి. ఈ పరిస్ధితిని జీవితాంతం గుర్తుంచుకోవడానికి గాను కొంతమంది తమ బిడ్డలకు కరోనా, లాక్‌డౌన్, కోవిడ్ వంటి పేర్లు పెడుతున్నారు.

Also Read:కరోనా బాధితురాలిని కూడా వదలని కామాంధులు

తాజాగా ఈ జాబితాలోకి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అపరూప పొద్దార్ కూడా చేరారు. వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్‌డౌన్ సమయంలో అపురూప ఒక పాపకి జన్మనిచ్చారు.

ప్రస్తుతం కంటికి కనిపించని సూక్ష్మజీవితో మానవాళి పోరాడుతున్న సమయంలో తనకు కూతురు జన్మించిందని అందుకే తన బిడ్డకు కరోనా అని ముద్దుపేరు పెట్టినట్లు అపరూప దంపతులు తెలిపారు.

సాధారణంగా బెంగాల్‌లో అప్పుడే పుట్టిన బిడ్డకు రెండు పేర్లు పెట్టే సాంప్రదాయం ఉంది. తల్లిదండ్రులు తమకి నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు, రెండవది మాత్రం ఆ ఇంటి పెద్ద నిర్ణయిస్తారు. అయితే తమ పాపకి అధికారికంగా పేరును మాత్రం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెడతారని అపరూప చెప్పారు.

Also Read:గుజరాత్ లో కరోనా వ్యాప్తికి 'నమస్తే ట్రంప్ ప్రోగ్రామే' కారణం: కాంగ్రెస్ ఆరోపణ

కరోనా సమయంలో భారతదేశంలో తమ పిల్లలకి లాక్‌డౌన్ అని పెట్టిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో ఒక కుమారుడికి లాక్‌డౌన్ అని, ఉత్తరప్రదేశ్‌లో ఒక శిశువుకు శానిటైజర్ అని పేరు పెట్టారు.

కాగా భారతదేశంలో గురువారం నాటికి 52,952 మందికి కోవిడ్ సోకగా, వీరిలో 1,783 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 15,267 మంది కోలుకుని డిశ్చార్జ్  అవ్వగా మరో 35,902 మంది చికిత్స పొందుతున్నారు.