కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంపై ఈ మహమ్మారి తన పంజాను విసురుతూనే ఉంది. తమిళనాడు ఎమ్మెల్యే మరణించిన సంఘటనను మనం ఇంకా మరువక ముందే.... మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ సోకి మరణించాడు. 

పశ్చిమబెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరాగణాల పరిధిలోని ఫాల్ట అసెంబ్లీ నియోజకవర్గ టీఎంసీ ఎమ్మెల్యే తామొనాష్ ఘోష్ కరోనా వైరస్ తో మరణించాడు. మై 3వ తేదీన కరోనా వైరస్ బారినపడి ఈయన అపోలో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మరణించాడు. 

పశ్చిమ బెంగాల్ నుంచి కరోనా వైరస్ బారినపడి మరణించిన తొలి రాజకీయ నాయకుడే ఈయనే. ఈయన టీఎంసీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈయన వయసు 60 సంవత్సరాలు. 

ఈ టీఎంసీ కంచుకోట నుంచి ఈయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలిపారు. 35 సంవత్సరాలుగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న నేతను కోల్పోవడం బాధాకరంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఇక కొన్ని రోజుల కిందటే....  డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. కరోనా వైరస్ సోకి మరణించిన రెండవ ఎమ్మెల్యే ఈయనే. తెలంగాణాలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు కరోనా వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. 

ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. మరో ఆప్ ఎమ్మెల్యే ఆతిషి కూడా కరోనా వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే.