Anubrata Mondal: పశువుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రత మొండాల్‌కు అసాన్‌సోల్ ప్రత్యేక కోర్టు ఈ నెల 20 వరకు సీబీఐ కస్టడీ విధించింది.
Anubrata Mondal: పశువుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రత మండల్ కు అసన్సోల్ ప్రత్యేక కోర్టు ఆగస్టు 20 వరకు సీబీఐ కస్టడీ విధించింది. అనుబ్రత మొండాల్‌ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. కానీ, కోర్టు తొమ్మిది రోజుల కస్టడీ విధించింది. అనుబ్రత మండల్ ను గురువారం రాత్రి కోల్‌కతాలోని నిజాం ప్యాలెస్‌లో గల సీబీఐ కార్యాలయానికి తరలించవచ్చునని భావిస్తున్నారు. కస్టడీలో ఉన్నప్పుడు అనుబ్రత అనారోగ్యానికి గురైతే.. చికిత్స కోసం కోల్‌కతాలోని కమాండ్ ఆసుపత్రికి తీసుకెళ్తామని తృణమూల్ నేత తరపు న్యాయవాది సంజీవ్ దాన్ కోరారు.
పశువుల అక్రమ రవాణా కేసులో అనుబ్రత మండల్‌ను గురువారం ఉదయం నుంచి సీబీఐ విచారించింది. ఈ తరుణంలో సాయంత్రం 4:30 గంటలకు ఆయనను అరెస్టు చేసి శీతల్‌పూర్‌లోని అతిథి గృహానికి తరలించారు.అనంతరం అతడిని సాయంత్రం 5 గంటల సమయంలో అసన్‌సోల్‌లోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ తరుణంలో అతడిని తమ కస్టడీలోకి తరలించాలని సీబీఐ కోరింది. కానీ, కోర్టు ఆగస్ట్ 20 వరకు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. అనుబ్రతను అసన్‌సోల్ కోర్టులో హాజరుపరచుతున్న తరుణంలో సీపీఎం, బీజేపీ మద్దతుదారులు పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. కోర్టు బయట గుమిగూడిన ప్రజానీకం 'CHOR CHOR' అని నినాదాలు చేశారు.
ఈ ఘటనపై రాష్ట్ర కేబినెట్ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ.. పార్టీలో ఎలాంటి అనైతికత, అవినీతిని సహించేది లేదని, అవినీతిని పార్టీ ఏ విధంగానూ అంగీకరించదని తెలిపారు. ఇప్పటికే అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చెప్పారని.. మమతా బెనర్జీ కూడా అదే మాట అన్నారనీ, ప్రజలకు హాని కలిగించే, ప్రజలను మోసం చేసే వారికి పార్టీ మద్దతు ఇవ్వదని అన్నారు.
