New Delhi: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)కి తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఒక్కటే ప్రత్యామ్నాయమ‌ని మేఘాలయ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అంత‌కుముందు, మేఘాల‌య‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి టీఎంసీ పోటీ చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

TMC leader Mahua Moitra criticizes Rahul Gandhi: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చేందుకు మేఘాలయలో తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎన్నికలలో పోటీ చేస్తున్న‌ద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. బీజేపీకి టీఎంసీ ఒక్కటే జాతీయంగా ప్రత్యామ్నాయమని మహువా మొయిత్రా అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లు ఖండించారు.

తృణ‌మూల్ కాంగ్రెస్ మేఘాల‌య‌లో ఎన్నిక‌ల ప్రచారంలో త‌మ పార్టీ అభ్యర్థి ఎల్గివా గ్వినెత్ రింజాకు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో మొయిత్రా మాట్లాడుతూ.. "కాంగ్రెస్ బీజేపీని ఓడించగలిగితే మేం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వారు ఘోరంగా విఫలమయ్యారు కాబట్టి, మేము ప్రత్యామ్నాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. బీజేపీకి కాంగ్రెస్ ఒక్క‌టే ప్ర‌త్యామ్నాయం" అని అన్నారు.

Scroll to load tweet…

ఈశాన్య భార‌తంలోని ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఇక్క‌డ బీజేపీకి లాభం చేకూర‌డానికి టీఎంసీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ ఇదే పని చేసిందనీ, బీజేపీకి సహాయం చేయాలనేది వారి ఆలోచనగా ఉంద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. "టీఎంసీ చరిత్ర మీకు తెలుసు.. పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న హింస, కుంభకోణాల వారి సంప్రదాయం మీకు తెలుసు. వారు గోవాలో (ఎన్నికలు) భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు.. బీజేపీకి సహాయం చేయాలనే ఆలోచనలో అలా చేశారు. సరిగ్గా ఇప్పుడు మేఘాలయలో ఇదే ఆలోచనలో ఉన్నారు. మేఘాలయలో బీజేపీని బలోపేతం చేసి అధికారంలోకి రావాలన్నదే టీఎంసీ ఆలోచన" అంటూ ఆరోపించారు.

Scroll to load tweet…

రాహుల్ వ్యాఖ్యలపై మహువా మొయిత్రా స్పందిస్తూ.. "వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతుంటే మేమేం చూస్తూ వుండాలా? మనం ఇంట్లో కూర్చుండటం చేయలా? లేక పోరాటం సాగించాలా?.." అని ప్రశ్నించారు. త‌మ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన‌ ఉత్తర షిల్లాంగ్ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని మహిళా ఓటర్లను మహువా మొయిత్రా కోరారు. "మహిళలంతా ఎల్గివాకు ఓటు వేస్తే మేమే గెలుస్తాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను ఎల్గివా గ్వినెత్ రింజా స్వయంగా రచించి ప్రచురించారని" ఆమె తెలిపారు. కాగా, మేఘాలయ అసెంబ్లీలోని మొత్తం 60 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని స్థానాలకు, అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అభ్యర్థులు 57 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ 56 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.