చెన్నై: జమ్మూ- కశ్మీర్‌ విభజనపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ కు వచ్చిన పరిస్థితి రేపు  తమిళనాడుకు, పశ్చిమబెంగాల్ కు సైతం రావొచ్చని హెచ్చరించారు. 

చెన్నైలో తమిళనాడు మాజీసీఎం, డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి వర్థంతి సందర్భంగా డీఎంకే అధికార దినపత్రిక మురసొలి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో కరుణానిధి కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించారు.  అనంతరం మమతా బెనర్జీ కేంద్రప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల మనోభవాలను తెలుసుకోవాలని కానీ జమ్ముకశ్మీర్ విషయంలో అలా జరగలేదన్నారు. జమ్మూ-కశ్మీర్‌ మాజీసీఎం ఫరూక్ అబ్దుల్లా కుమారుడి ఇంటికి వెళ్లలేకపోతున్నట్లు విలపించిన తీరును చూసి ఆవేదన కలిగిందన్నారు.  

కరుణానిధి వర్థంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు హాజరుకావాల్సిన ఫరూక్ అబ్ధుల్లా ప్రస్తుతం ఎక్కడనున్నారో తెలియని పరిస్థితి అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కరుణానిధి తనయుడు డీఎంకే చీఫ్ స్టాలిన్‌ మండిపడ్డారు.  

సామాజికంగా విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో ఆర్థికపరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయోద్దన్నదే తమ అభిమతమన్నారు.