సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన మ్యూజిక్ యాప్ ‘టిక్ టాక్’. ఈ యాప్ విడుదలైన అతి కొద్దికాలంలోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ యాప్ సహాయంతో.. తమలో ఉన్న ప్రతిభను చాలా మంది ప్రపంచానికి పరిచయం చేసుకొని.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటివారందరికీ ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. 

దీనిని ఇప్పుడు నిషేధిస్తున్నారు. చాలా మంది ఈ  యాప్ ని ఉపయోగించి జాతివిద్రోహ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో దీనిని బ్యాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిని బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించగా.. తాజాగా టిక్‌ టాక్‌ యాప్‌ను గూగుల్‌ బ్యాన్‌ చేసిందని రాయిటర్స్‌  రిపోర్ట్‌ చేసింది.  టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లను నిషేధించాలనే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు  తెలుస్తోంది. 

టిక్‌ టాక్‌ యాప్‌ నిషేధంపై స్టే విధించాలంటూ  చైనాకు చెందిన బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌ టాక్‌ అందుబాటులో లేదు. అయితే యాపిల్‌  స్టోర్‌లో అందుబాటులో ఉంది.  తాజా పరిణామంపై  గూగుల్‌, యాపిల్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

చైనా ఆధారిత యాప్ అయిన టిక్ టాక్‌ను తమిళనాడులో నిషేదించాలన్న అభ్యర్థన సమర్దించిన మద్రాస్‌ హైకోర్టు యాప్‌పై నిషేధాన్ని విధించింది. అలాగే  గూగుల్, ఆపిల్ స్టోర్లలో  ప్రమాదకరమైన యాప్‌ను తొలగించాలని కేంద్రాన్ని కోరింది. టిక్ టాక్, హలో యాప్‌లు దేశవ్యాప్తంగా టీనేజర్‌లు, యువతపై  దుష్ర్పభావాన్ని చూపిస్తున్నయని  పేర్కొంది.  దీనికి అనుకూలంగానే సుప్రీం కూడా తీర్పునివ్వడంతో గూగుల్‌ ఈ చర్యకు తీసుకున్నట్టు సమాచారం.