ఈ మధ్యకాలంలో యూత్‌లో బాగా క్రేజ్ తెచ్చుకన్న టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. అశ్లీల వీడియోలతో పాటు యువతపై దుష్ప్రభావం చూపిస్తుండటంతో టిక్‌టాక్‌పై సంప్రదాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయం మద్రాస్ హైకోర్టు వరకు వెళ్లడంతో న్యాయస్థానం సైతం టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించాలని ఆదేశాలు సైతం జారీ చేసి, ఆ తర్వాత దానిని ఎత్తివేసింది. ఈ సమయంలో టిక్ టాక్ యాప్ వల్ల ఓ జంటకు మేలు కలిగింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన సురేశ్, జయప్రద దంపతులకు ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న వారి సంసారంలో ఒక కుదుపు.. మూడేళ్ల క్రితం 2016లో డ్యూటీకి అని బయటికి వెళ్లిన సురేశ్ ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు.

పలు చోట్ల గాలించిన ఆమెకు నిరాశే ఎదురైంది.. దీంతో చేసిది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది, అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జయప్రదకు తెలిసిన వారు ఒకరు టిక్ టాక్‌లో వీడియో చూస్తుండగా సురేశ్‌ను పోలిన వ్యక్తి ఆయన కంటపడ్డాడు.

ఒక ట్రాన్స్‌జెండర్‌తో పాటు అతనిని చూసిన ఆయన.. ఈ సంగతిని జయప్రదకు చేరవేశాడు. వీడియోను జాగ్రత్తగా గమనించిన ఆమె.. అందులో ఉంది తన భర్తేనని తేల్చేసింది.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులకు ఈ సంగతి చెప్పింది.

దీంతో పోలీసులు హోసూరులో సురేశ్‌తో పాటు పక్కన వున్న ట్రాన్స్‌జెండర్ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంలో ఎదురైన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని అందుకే ఇళ్లు విడిచి పారిపోయానని సురేశ్ తెలిపాడు.

హోసూరు వెళ్లి ఓ ట్రాక్టర్ కంపెనీలో మెకానిక్‌గా చేరానని... అలాగే ట్రాన్స్‌జెండర్ మహిళతో ఉన్న సంబంధం గురించి కూడా చెప్పాడు. అంతా విన్న పోలీసులు సురేశ్, జయప్రదలకు కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం ఇంటికి పంపారు.