తన సోదరిపై అత్యాచారం చేసి.. ఆమె మృతికి కారణమైన వ్యక్తిపై బాధితురాలి సోదరుడు పగ తీర్చుకున్నాడు. అది కూడా జైలులో చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సంఘటన తీహార్ జైలులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని దక్షిణపురిలోని అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన జాకీర్ అనే యువకుడి మైనర్ సోదరిపై 2014లో నిజాముద్దీన్ నివాసి మహ్మద్ మెహతాబ్ అత్యాచారం చేశాడు. దీంతో బాధిత బాలిక ఆత్మహత్య చేసుకుంది.

ఈ కేసులో నిందితుడైన మహ్మద్ మెహతాబ్(27) ను పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. అనంతరం బాధిత బాలిక సోదరుడైన జాకీర్ (21) 2018 జులైలో రిక్షా డ్రైవరును హత్య చేసి అరెస్టు అవడంతో అతన్ని కూడా తీహార్ జైలుకు తరలించారు. జైలు అధికారులు మెహతాబ్, జాకీర్ లను వేర్వేరు జైలు కాంప్లెక్స్ లలో ఉంచారు. 

తనను మెహతాబ్ ఉన్న జైలు కాంప్లెక్సులోకి బదిలీ చేయమని జాకీర్ మునుపటి వార్డులో తోటి ఖైదీలతో గొడవపడ్డాడు. దీంతో జాకీర్ ను మెహతాబ్ ఉన్న వార్డుకు తరలించారు. సోదరిపై అత్యాచారం చేసిన మెహతాబ్ పై పగతో రగిలిపోయిన జాకీర్ ఇదే అదనుగా భావించి లోహపు స్ట్రిప్‌తో అతన్ని పొడిచాడు. మెహతాబ్ కడుపు, మెడ వద్ద లోతైన గాయాలు కనిపించడంతో పాటు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించాడని వైద్యులు ప్రకటించారు.


తన సోదరిపై అత్యాచారం చేసిన వ్యక్తిని జైలులో చంపి ప్రతీకారం తీర్చుకున్నాడని జైలు అధికారులు చెప్పారు. ఇద్దరు ప్రత్యర్థులైన ఖైదీలను ఒకే జైలు కాంప్లెక్సులో ఉంచడం వల్లనే ఈ ఘటన జరిగిందని, దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని తీహార్ జైలు అధికారులు చెప్పారు.