Asianet News TeluguAsianet News Telugu

ఆమె పులిని జయించింది.. 15 నెలల చిన్నారికోసం ఒట్టి చేతులతో పులితో వీరోచిత పోరాటం చేసిన మాతృమూర్తి..

పులినుంచి తన చిన్నారిని కాపాడుకోవడానికి సివంగిలా మారింది ఆ తల్లి. ఒట్టిచేతులతో పోరాడి 15నెలల చిన్నారిని కాపాడుకుంది. తానూ తీవ్రగాయాలపాలయ్యింది. ప్రస్తుతం తల్లీ,బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 

Tigress mom fights off tiger, saves 15-month baby In Madhya Pradesh
Author
First Published Sep 6, 2022, 11:53 AM IST

భోపాల్‌ : పిల్లల మీద ఎవరైనా దాడిచేస్తే తల్లి ఎలా కాపాడుకుంటుందో తెలిపే అద్భుతమైన ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. తన 15 నెలల చిన్నారిని పులి నోటినుంచి కాపాడడానికి ఓ తల్లి తన ప్రాణాలను అడ్డువేసింది. నిరాయుధమైన చేతులతో పులితో పోరాడింది. తాను తీవ్ర గాయాలపాలైనా.. పులిని ఓడించింది. వీరోచితంగా పోరాడి పులి పంజా నుంచి.. రాక్షస కోరాలనుంచి తన చిన్నారిని కాపాడుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, తల్లీ బిడ్డ ప్రస్తుతం క్షేమంగా కోలుకుంటున్నారు. 

పులి దాడిలో చిన్నారి తల మీద, ఒంటిమీద లోతైన గాయాలయ్యాయి. చిన్నారిని రక్షించే క్రమంలో తల్లి ఊపిరితిత్తుల్లో పులి పంజా లోతుగా దిగింది. పొత్తి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఘటన తల్లి అరుపులు విని వచ్చిన గ్రామస్తులు ఎట్టకేలకు పులిని తరమగలిగారు. వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. రక్తపుముద్దలా మారిన వారిద్దరినీ చూసి ఆస్పత్రి సిబ్బంది కూడా ఖంగుతిన్నారు.

తల్లి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని మొదట వైద్యులు తెలిపారు. కానీ ఆ తరువాత తల్లి పరిస్థితి నిలకడగా మారడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అసలు ఇంతకు ఏం జరిగిందంటే..  బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ ఏరియాకు ఆనుకుని ఉన్న గ్రామంలో ఈ ఘటన జరిగింది. అర్చన అనే ఆ వీరమహిళ తన కుటుంబంతో ఉమారియా జిల్లాలోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లోని మాలా బీట్ పరిధిలోని రోహనియా గ్రామంలో నివసిస్తుంది. ఘటన జరిగిన రోజు ఆమె తన కొడుకు రవిరాజ్‌ను తీసుకుని గుడిసె బయటకు వచ్చింది. అప్పటికే అక్కడి, పొదల్లో నక్కి ఉన్న పులి వారి మీద దాడి చేసింది. 

ఆర్య స‌మాజ్ ఇచ్చే మ్యారేజ్ స‌ర్టిఫికేట్ చెల్ల‌దు.. అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

చిన్నారి తలను నోట కరుచుకుని.. మెడను కొరకడానికి విశ్వప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన తల్లి.. చిన్నారిని కాపాడుకోవడానికి ఒంటి చేతులతో పులితో పోరాడింది. రెండు నిమిషాలపాటు జీవన్మరణ పోరాటం కొనసాగింది. పులి పంజాలు చేస్తున్న గాయాలను పట్టించుకోకుండా చిన్నారిని దక్కించుకోవడానికి పోరాడింది ఆ మాతృమూర్తి. ఆమె కేకలు, పులి గాండ్రింపులు విన్న గ్రామస్తులు అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు. దీంతో పులి తోకముడిచింది.  అడవుల్లోకి పారిపోయింది. గ్రామస్థులు తల్లీబిడ్డలను మాన్‌పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి 30కిలోమీటర్ల దూరంలోని ఉమరియా జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

ఈ పోరాటంలో అర్చన పొత్తికడుపు, వీపు, చేతులకు గాయాలయ్యాయని ఆమె భర్త భోళా ప్రసాద్ తెలిపారు. ఉమారియా కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ ఆసుపత్రిలో ఉన్న మహిళ, ఆమె కుమారుడిని పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. తదుపరి చికిత్స కోసం వారిని 130 కిలోమీటర్ల దూరంలోని జబల్‌పూర్‌కు తరలించారు. గ్రామస్తుల భద్రతపై కలెక్టర్ అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పులిని తిరిగి అడవిలోకి పంపించేందుకు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. గ్రామస్తులు రాత్రిపూట ఇళ్లలోనే ఉండాలని సూచించారు. గత ఏడాది నవంబర్‌లో, ఎంపీ సిధి జిల్లాలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలోని గ్రామంలో ఒక గిరిజన మహిళ కూడా ఇలాగే  ఒట్టి చేతులతో చిరుతపులిని ఎదుర్కుని.. దాని పంజానుంచి తన ఆరేళ్ల కుమారుడిని కాపాడుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios