ముంబైలో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్​లో చెత్త ఏరుకునే ఓ వ్యక్తి.. ప్లాట్​ ఫాం మీద నిద్రిస్తున్న ఓ మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి..తరువాత ఆ చిన్నారిపై  అత్యాచారానికి పాల్పడ్డాడు.

ముంబైలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిని ఓ దుర్మార్గుడు కిడ్నాప్ చేసి.. దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేవలం గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. 

ఇంతకీ ఏం జరిగింది.

జల్గావ్​ చెందిన ఓ మహిళ తన మూడేళ్ల కూతురితో బుధవారం రాత్రి పాన్వెల్​ రైల్వే స్టేషన్​లో రైలు దిగింది. అక్కడి నుంచి మరో రైలు ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే.. ఆ రాత్రి కావడంతో ఆ రైల్వే స్టేషన్​ ప్లాట్ ఫాం మీదే తన కూతురితో పాటు పడుకుండిపోయింది. కొంత సేపటి తర్వాత ఆ తల్లి నిద్ర లేచి, బాత్​రూమ్​ కోసం వెళ్లింది. తిరిగి వచ్చేసరికి.. తన చిన్నారి కనిపించకుండా పోయింది. ఆ తల్లి కంగారు కంగారుగా చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికింది. అనంతరం పాన్వెల్​ గవర్న్​మెంట్​ రైల్వే పోలీస్​లకు ఫిర్యాదు చేసింది. తన బిడ్డ కనిపించడం లేదని, తనకు సాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.

వెంటనే స్పందించిన పోలీసులు.. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పాన్వెల్​ రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య పాంత్రంలో స్పృహ కోల్పోయి పడి ఉన్న చిన్నారిని పోలీసులు గుర్తించారు. ఆ చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు అనుమానించారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు.

ఈ క్రమంలోనే స్టేషన్ లో ఉన్నసీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దీంతో నిందితుడి ఆచూకీ లభించింది. ఆ రాత్రి.. ఆ తల్లి తన కూతురిని విడిచి బాత్​ రూంకి వెళ్లిన క్రమంలో ఓ దుర్మార్గుడుఅక్కడికి వెళ్లాడు. ఎవరూ లేనిది చూసి.. ఆ చిన్నారిని అపహరించాడు. అనంతరం రైల్వే స్టేషన్ కు పశ్చిమ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా పోలీసులు గురువారం సాయంత్రానికే నిందితుడిని పట్టుకున్నారు.

నిందితుడిని ముకేశ్​ కుమార్​ బాబు (30). రైల్వే స్టేషన్​లలో చెత్త ఏరుకుంటూ ఉంటాడు. సియాన్​- పాన్వెల్​ హైవేకు చెందిన కలంబోలి ఫ్లైఓవర్​ కింద జీవిస్తూ ఉంటాడు. కాగా.. అతడిని జుయ్​నగర్​ రైల్వే స్టేషన్​ పరిధిలో పోలీసులు అరెస్ట్​ చేశారు.చిన్నారి ఇంకా ఆసుపత్రిలో ఉన్నట్టు సమాచారం. ప్రమాదం నుండి బయటపడింది. ఆమెకు గాయాలయ్యాయని పన్వెల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి చెందిన జస్బీర్ రాణా తెలిపారు.