అల్లుడి వేధింపులు తట్టుకోలేక ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విరుదునగర్ జిల్లా కార్యపట్టి కీలవనూరుకు చెందిన అడైకలం(65)కి ఓ కుమార్తె ఉంది. ఆమెతల్లితో కలిసి జీవిస్తోంది. కుమార్తె మునియమ్మాళ్ కు  ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె ఉన్నారు. కూతురికి కూడా పెళ్లి చేసింది. అయితే.. ఆ అల్లుడి కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

మునియమ్మాళ్‌(42) కుమార్తె జయలలిత(18)ను ఇంజినీర్‌గా పనిచేస్తున్న తమ సమీప బంధువు ముత్తుకుమార్‌కు ఇచ్చి వివాహం చేసింది. పెళ్లి అయిన నాటి నుంచే ముత్తుకుమార్‌ భార్య జయలలితను వేధించేవాడు.


అలాగే అత్త మునియమ్మాళ్‌పై ఆమె కుమారులకు లేనిపోనివి చెప్పేవాడు. ఈక్రమంలోనే అత్తకు వివాహేతర సంబంధం కూడా అంటగట్టాడు. ఈ ఘటనలతో మనస్థాపం చెందిన మునియమ్మాళ్‌ కుమార్తె జయలలితతో కలిసి కార్యాపట్టిలోని తన తల్లి అడైకలం ఇంటికి వచ్చేసింది. దీంతో మరింత ఆగ్రహించిన ముత్తుకుమార్‌ తనకు కొంత సొమ్ము కావాలని ఆదివారం ఫోన్‌ ద్వారా మునియమ్మాళ్‌ను బెదిరించాడు.

మంగళవారం వస్తానని, నగదు సిద్ధం చేయాలని హుకుం జారీ చేశాడు. అల్లుడి ఒత్తిడిని తట్టుకోలేని మునియమ్మాళ్‌ సోమవారం రాత్రి తల్లి అడైకలం, కుమార్తె జయలలితతో కలిసి విషం తాగేసింది. మంగళవారం ఉదయాన్నే అడైకలం ఇంటికి వచ్చిన ముత్తుకుమార్‌ తలుపు తట్టినా తెరుచుకోలేదు. ఇరుగుపొరుగు వారు కిటికీలో నుంచి చూడగా ముగ్గురు మహిళల మృతదేహాలు కనిపించాయి.

దీనిపై వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకను పసిగట్టిన ముత్తుకుమార్‌ అక్కడ నుంచి పరారయ్యాడు.  ఆవియూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరుప్పు కోట్టై ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ముత్తుకుమార్‌ కోసం గాలిస్తున్నారు.