ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లా రిజర్వు గార్డ్స్‌ (డీఆర్‌జీ) సిబ్బంది వెళ్తున్న బస్సును మందుపాతరలతో పేల్చేశారు. నారాయణపూర్‌ జిల్లాలో మంగళవారం 27మంది సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

నారాయణపూర్‌ జిల్లాలోని కడేనార్‌, కన్హరగావ్‌ల మధ్య వెళ్తున్న ఈ బస్సును లక్ష్యంగా చేసుకొని ఐఈడీ పేల్చారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డీఎం అవస్థీ మాట్లాడుతూ.. కూంబింగ్ నిర్వహించి తిరిగి క్యాంపులకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని మావోలు తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.