ఢిల్లీ: ఇటీవలే అమృత్ సర్ లో ఘోర రైలు ప్రమాదం ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రమాదం అనుకోకుండా జరిగితే ఇది మద్యం మత్తులో చోటు చేసుకుంది. ఢిల్లీలోని నంగ్లోయి రైల్వేస్టేషన్ సమీపంలో ఢిల్లీ-బికనీర్ మార్గంలో ముగ్గురు వ్యక్తులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రైల్వే డీసీపీ దినేష్ గుప్తా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను ఘటనపై ఆరా తీశారు. ఉదయం 7:15కు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ సమయంలో రైల్వే పట్టాలపై మద్యం సేవిస్తూ ఉండడంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని, లేదంటే వారు మద్యంమత్తులో రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో ఇలా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రమాద సమయానికే ముగ్గురు వ్యక్తులు విపరీతమైన మద్యం మత్తులో ఉన్నారని డీసీపీ తెలిపారు. అయితే వారి మరణానికి సంబంధించిన అసలు కారణాలు తెలియలేదన్నారు.  రైల్వే రక్షణ దళం, రైల్వే పోలీసులు, ఇతర పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉండటంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.