బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓ మహిళ అత్యంత దారుణమైన పనికి ఒడిగట్టింది. భర్తతోనూ అత్తమామలతోనూ గొడవ పడిన నాగమణి (45) అనే మహిళ దాడిలో ఆ ముగ్గురు మరణించారు. తన భార్త నాగరాజు (50), మామ వెంకటేష్ గౌడ (75), అత్త కుళ్లమ్మ (68)లను నాగమణి చంపినట్లు పోలీసులు తెలిపారు. 

కర్ణాటకలోని మైసూరు జిల్లా కేఆర్ పెట్ హెమ్మడహళ్లికి చెందిన నాగమణి ప్రతి చిన్న విషయానికి భర్తతోనూ ఇతర కుటుంబ సభ్యులతోనూ గొడవ పడేది. పది రోజుల క్రితం కొబ్బరి తురిమే కత్తిపీటతో అత్తమామలపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన భర్తను కూడా కొట్టింది. 

ఆ దాడిలో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిని కేఆర్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ నాగరాజు గత వారం మరణించాడు. అత్తామామలు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. 

నాగరాజు, నాగమణి దంపతులకు 18, 20 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. నిందితురాలిని అప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించారు. కొన్నేళ్లుగా నాగమణి కుటుంబ సభ్యులతోనే కాకుండా ఇరుగుపొరుగువారితో కూడా గొడవ పడుతూ వచ్చిందని చెబుతున్నారు.